సర్పంచ్ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్‌లో పట్టిన గతే : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

సర్పంచ్ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్‌లో పట్టిన గతే : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ, ప్రజా పాలన వైపే ఓటర్లు మొగ్గు చూపారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ప్రభుత్వం, సీఎంపైన తప్పుడు ప్రచారం చేయడం ఆపాలని, ఇదే విధంగా కొనసాగితే మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పట్టిన గతే రాబోయే ఎన్నికల్లో పడుతుందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు, ఇంకా ఒకళ్ళిద్దరు తప్ప ఎవరున్నారని, రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద మీరేమైనా మాట్లాడుతున్నారా, మీకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదని మల్లు రవి విమర్శలు గుప్పించారు. కేటీఆర్.. మీ చెల్లెలు మీ గురించి ఏం చెబుతుందో వినాలని, మీరు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలే మళ్లీ మీకు బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తప్పుడు ప్రచారం చేశారని, కానీ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారని ఎంపీ వ్యాఖ్యానించారు.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ ఎన్నికలు నిర్వహిస్తే మన రాష్ట్రానికి రావాల్సిన రూ.3500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయని మల్లు రవి అన్నారు. ఇటీవల ప్రకటించిన ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావించిందని, కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. అందుకే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి.. పంచాయతీ ఎన్నికలకు వెళ్తామన్నారు. కేటీఆర్ లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, భూముల కేటాయింపు.. వాటి కన్వర్షన్‌కు అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ భూములు ఖాళీగా ఉండకూడదని చెప్పి వారికి కన్వర్షన్‌కు అవకాశం ఇచ్చారని, ఆ భూమిని ఇంకో రకంగా మార్చుకునేందుకు అనుమతి మాత్రమే ఇచ్చారని ఎంపీ వివరించారు. హర్యానాలో దళిత ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశానని, కాంగ్రెస్ తరఫున పూరన్ కుమార్‌ కుటుంబానికి అండగా నిలుద్దామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు.

Next Story