రాజీవ్ గాంధీపై చేయి వేస్తే నీ తాట తీస్తాం.. జాగ్రత్త! కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హెచ్చరిక

by Ramesh Naini |

కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ చెప్పుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు.

రాజీవ్ గాంధీపై చేయి వేస్తే నీ తాట తీస్తాం.. జాగ్రత్త! కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ చెప్పుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) మండిపడ్డారు. ఇవాళ సీఎల్పీ మీడియా సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ దీక్ష ఎలా చేశాడో, ఎలాంటి ఫ్లూయిడ్స్ తీసుకున్నాడో అందరికీ తెలుసు. 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష పెద్దదా?’ అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, కిష్టయ్య వంటి ఉద్యమ వీరుల త్యాగాలను బీఆర్ఎస్ ఎందుకు గుర్తు చేసుకోదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుచేస్తూ, ‘మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే కేటీఆర్ ఎగిరి పడుతున్నాడు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో చిన్నారెడ్డి నాయకత్వంలో సాగిన సంతకాల సేకరణలో మహేష్ గౌడ్ కీలక పాత్ర ఉందని గుర్తు చేశారు. సాగరహారం రోజు కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారు? అంటూ దయాకర్ నిలదీశారు. తెలంగాణ సాధనకు వ్యతిరేకంగా కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు చేశాడని, మిలియన్ మార్చ్‌ను కూడా అడ్డుకున్నాడని ఆరోపించారు. ఉదంతంలో కోదండరాం, గద్దర్, అందెశ్రీ, గూడ అంజయ్యలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ అన్నాడు. అదే సోనియాను తర్వాత బజారుకీడుస్తున్నారని అనడం నిచి రాజకీయమేగాని మరేమీ కాదు.. అని దయాకర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను చంపడానికి కేసీఆర్ ప్రయత్నించాడని ఆరోపించారు.

తెలంగాణ నిజమైన బిడ్డ రేవంత్ రెడ్డినేనని పేర్కొంటూ, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి సోనియాకు రేవంత్ బహుమతి ఇచ్చాడు అని అన్నారు. అందె శ్రీ అంత్యక్రియలలో సీఎం రేవంత్ వ్యవహరించిన తీరు దేశం చూసి అబ్బురపడిందని కొనియాడారు. బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు ‘ఫోర్-20’ మాత్రమే మిగిలారని, సర్పంచ్ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం హడావిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి అంబేద్కర్‌ను అవమానించాడని కూడా ఆరోపించారు. ‘రాజీవ్ గాంధీపై చేయి వేస్తే నీ తాట తీస్తాం.. జాగ్రత్త!’ అని కేటీఆర్‌ను హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ‘కల్ల’ అని ప్రకటించారు. ఉద్యమకారులను జైలులో పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని, రాక్షసంగా వ్యవహరించాడని అని దయాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరలు, కేసీఆర్ ఇచ్చిన చీరలు.. జనం తేడా చూస్తున్నారని, పిచ్చి మాటలు మాట్లాడి కేటీఆర్ తన ఇజ్జత్ తీసుకోవద్దని దయాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఊసరవెల్లితో పోలుస్తూ, అది కూడా వాళ్లను చూసి సిగ్గుపడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి కూడా కేసీఆర్‌కు భయం.. అసెంబ్లీకి రావడానికి కారణమే రేవంత్ రెడ్డి భయం అని దయాకర్ వ్యాఖ్యానించారు.

Next Story