‘మేము కూడా ఉప్పు, కారం తింటున్నాం’.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర హెచ్చరిక

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు.

‘మేము కూడా ఉప్పు, కారం తింటున్నాం’.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు. శనివారం సీఎల్పీలో ఎమ్మెల్యే దేవరకద్ర జి.మధుసూదన్ రెడ్డి(Madhusudhan Reddy), వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Megha Reddy) మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ వ్యవహారశైలి నవ్వుకునేలా ఉందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అంతర్గత అంశాలు చర్చకు రాకుండా కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పైన అక్కసు వెళ్లగక్కడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా మారింది.. రేవంత్ రెడ్డిని కేసుల్లో ఇరికించడానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని అన్నారు. కేటీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌లో కోవర్టులు ఎవరో కేటీఆర్ బయటపెట్టాలని అన్నారు. కవిత లేఖ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే సీఎం రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పిచ్చికుక్కలా కేటీఆర్ వ్యవహర శైలి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ మొహం చూస్తేనే ఆయన ఎంత అసహనంలో ఉన్నాడో తెలుస్తుందని అన్నారు. తెలంగాణకు పట్టిన దెయ్యం కల్వకుంట్ల కుటుంబం.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు తెలంగాణ సంపదను జలగలా పీల్చింది.. ఇంకా పీల్చడానికి మరో కొత్త కుట్రకు కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని అన్నారు. తెలంగాణకు పట్టిన దెయ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి వదిలించారని తెలిపారు. రేవంత్ రెడ్డి రబ్బర్ బాల్ లాంటి వాడు.. ఎంత తొక్కితే అంత పైకి లేస్తారని చెప్పారు. మరోసారి సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. కేటీఆర్ తాట తీస్తాం అని హెచ్చరించారు. 2023, 24 సంవత్సరంలో బీజేపీ రూ.2,243 కోట్లు.. బీఆర్ఎస్‌కు 1400 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో బీజేపీకి ఎలా విరాళాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు కేవలం రూ.281 కోట్లే అని చెప్పారు.

‘కవిత పైన కేసు పెట్టినప్పుడు ఈడీని బీజేపీ జేబు సంస్థగా కేటీఆర్ మాట్లాడాడు.. రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్‌లో ప్రస్తావిస్తే మాత్రం మీకు ఈడీ మంచిదైందా..? కన్న కూతురిని కలవడానికే కేసీఆర్ సమయం ఇవ్వడం లేదు.. హరీష్ రావు అలిగితే మాత్రం కేటీఆర్ ఇంటికి వెళ్లి బతిమాలుకున్నాడు.. కవిత చెప్పి దెయ్యాలు ఆమె అన్న కేటీఆర్, ఇంకో అన్న సంతోష్, బావ హరీష్ రావే కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి మేమంతా కవచంలా నిలబడతాం.. మేం కూడా ఉప్పు, కారం తింటున్నాం.. కేటీఆర్ కంటే ఎక్కువ బూతులు మాట్లాడుతాం.. దయచేసి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story