కేటీఆర్ ఎవరు?, తెలంగాణతో ఆయనకు సంబంధం ఏంటి?: ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ పార్టీపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్(Mandula Samuel) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ ఎవరు?, తెలంగాణతో ఆయనకు సంబంధం ఏంటి?: ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్(Mandula Samuel) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే బొందల గడ్డ పార్టీ అని అన్నారు. తెలంగాణతో కేటీఆర్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు తెలంగాణ ఉద్యమం గురించి కేటీఆర్‌కు తెలుసా? అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రివర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడు.. అసలు బీఆర్ఎస్ పార్టీనే దొంగల పాళ్యం పార్టీ అని విమర్శించారు. కేటీఆర్‌ను నాయకుడిగా ప్రజలు ఇంకా గుర్తించట్లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందాలో ఉన్నారు, భూ మాఫియాలో ఉన్నారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేశామని రూ.8 లక్షల కోట్లు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ముందు కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాజకీయం కోసం సొంత కుటుంబసభ్యురాలిని బయటకు బయటకు గెంటేసిన మీరు నీతులు చెబితే మేము వినాలా? అని సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే బీఆర్ఎస్‌లో ఒక్కరు మిగలరు అని అన్నారు. 2023లో అధికారంలోకి వచ్చి మళ్ళీ దోచుకోవాలని చూశారు.. కానీ ప్రజలు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు తుంగతుర్తిలో విచ్చలవిడిగా ఇసుక దందా చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏండ్ల చరిత్ర ఉందని చెప్పారు. బీఆర్ఎస్ చరిత్ర ఏంటని అడిగారు. జూబ్లీహిల్స్‌లో కూడా కంటోన్మెంట్ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని అన్నారు. భవిషత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story