జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ.. మూడో స్థానంలో బీఆర్ఎస్

by Gantepaka Srikanth |

కేటీఆర్‌కు దమ్ముంటే జూబ్లీహిల్స్ గెలుపు పైన సవాల్ విసరాలని, జూబ్లీహిల్స్‌లోనే కాదు రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కథ ముగిసిందని కాంగ్రెస్​ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ.. మూడో స్థానంలో బీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కు దమ్ముంటే జూబ్లీహిల్స్ గెలుపు పైన సవాల్ విసరాలని, జూబ్లీహిల్స్‌లోనే కాదు రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కథ ముగిసిందని కాంగ్రెస్​ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కనీసం 50 వేల మెజార్టీ వస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలతో అక్కడి ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారని, రాష్ట్రంలో సంతోషంగా లేనిది కేవలం కల్వకుంట్ల కుటంబం మాత్రమే అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో ఏదో చేస్తామని కేటీఆర్ తెగ డబ్బా కొడుతున్నారని, ఆరు సర్వేలు బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఇచ్చాయట.. ప్రపంచంలో ఏ దిక్కు మాలిన సర్వే కూడా ఈ విషయం చెప్పదని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్‌లో సర్వే చేయాల్సిన అవసరం లేదు.. నాలుగు వీధులు తిరిగితే ఎవరికైనా అర్థం అవుతుందని, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌లో మూడో స్థానం లోనైనా ఉంటుందా లేదా అన్నది కేటీఆర్​చూసుకోవాలని, ఎవరైనా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బీఆర్ఎస్ నాలుగో స్థానానికి వెళ్లడం ఖాయమని మేడిపల్లి సత్యం అన్నారు.

రాష్ట్రానికి కేటీఆర్​శనిగా దాపురించారని, పొద్దున్న లేస్తే అపశకునం మాటలు తప్ప ఆయన నోటి నుంచి ఇంకొకటి రావడం లేదని ఆయన మండిపడ్డారు. కేటీఆర్​రాష్ట్రంపైన పడి ఏడుస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డిపైన ఈర్ష, ద్వేషం, కుళ్లు అని, ప్రజలను రెచ్చగొట్టి బతకాలని చూస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగితే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందన్న భయంతో కేటీఆర్ ఉన్నారన్నారు. కేటీఆర్ మాటలు వింటే అసహ్యం వేస్తోందని, రాజకీయ విమర్శలను మేం ఆహ్వానిస్తాం కానీ, కేటీఆర్ చేసేవి నీచమైన ఆరోపణలు, నికృష్ట ఆలోచనలు అన్నారు. కేటీఆర్ చెల్లె కవిత మాటలకు సమాధానం చెప్పలేని చవట, దద్దమ్మ అన్నారు. ఎల్అండ్ టీని బెదిరించామని కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఎల్అండ్ టీ వాళ్లు ఎవరైనా కేటీఆర్‌కు చెప్పారా? గతంలో బేగంబజార్ నుంచి మెట్రో లైన్ వెళ్లకుండా ఆపింది కేసీఆర్ కాదా..? పదేళ్ల పాటు బీఆర్ఎస్​సెటిలర్లు, వ్యాపారవేత్తలు, చివరకు ఉద్యమకారులను బెదిరించి బతికిందని మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు.

Next Story