- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం పరిగెడుతోంది: ప్రభుత్వ విప్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, ఈ స్వల్ప కాలంలోనే తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు పడ్డాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, ఈ స్వల్ప కాలంలోనే తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు పడ్డాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రూ. 24,000 కోట్ల రీ-స్ట్రక్చరింగ్‌తో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టామని ఆయన తెలిపారు. మందగించిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుందని, ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వాహనాల విక్రయాలు కూడా భారీగా పెరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం పేదలకు సాయం చేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక చక్రం తిరిగేలా చేస్తున్నాయని యెన్నం విశ్లేషించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా సుమారు రూ. 10,000 కోట్లు ఆదా అయ్యాయి. ఈ సొమ్ము నేరుగా మహిళల చేతుల్లోనే మిగలడం వల్ల మార్కెట్‌లో వినియోగం పెరిగింది. గృహజ్యోతి ద్వారా 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా ఏడాదికి రూ. 8,400 కోట్ల భారం తగ్గింది. రేషన్ పథకాలతో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు సుమారు రూ. 16,200 కోట్ల మేర ఆర్థిక ఉపశమనం కలిగింది.
భవిష్యత్ నగరాలు - భారీ పెట్టుబడులు
తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఇంజిన్‌గా మారబోతోంది. గ్రీన్ ప్లానింగ్, క్లీన్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి వసతులతో దీనిని నిర్మిస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన ద్వారా హైదరాబాద్‌కు కొత్త అందం రావడమే కాకుండా, టూరిజం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. UAE సహా ప్రపంచ వేదికలపై తెలంగాణకు గుర్తింపు పెరిగిందని, గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని యెన్నం తెలిపారు. ఇప్పటికే 2,34,000 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మేస్త్రీలు, కార్మికులకు భారీగా ఉపాధి దొరుకుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. మొత్తంగా 28 నెలల కాంగ్రెస్ పాలనలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం జోడెద్దుల తరహాలో సాగుతూ తెలంగాణ జీడీపీ వృద్ధికి బాటలు వేస్తున్నాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.






