- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ పెంపకంలో అభినవ గోబెల్స్ లా తయారైన కేటీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు
కేసీఆర్ అనే నియంత పెంపకంలో కేటీఆర్ అభినవ గోబెల్స్ లా తయారయ్యాడని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ అనే నియంత పెంపకంలో కేటీఆర్ అభినవ గోబెల్స్ లా తయారయ్యాడని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సీఎల్పీ మీడియా సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయడమే కేటీఆర్ పనిగా మారిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పైన అక్కసు, కడుపుమంటతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆయనే కనీసం పదేళ్ల పాటు కొనసాగుతారని తెలిపారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశం పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ పని చేసినా ఆరోపణలు, విమర్శలు చేయడం అలవాటుగా మారిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న అవినీతి సొమ్ముతో నాయకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మారిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర అప్పగించారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించ లేకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చిందని అన్నారు. బీజేపీతో కుమ్మక్కు కావడంతో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ కు రెండో స్థానం వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికల్లో చిత్తు అవుతున్న కేటీఆర్ లో మార్పు రావడం లేదని, కేటీఆర్, హరీష్ రావు గోబెల్స్ ప్రచారం వల్లనే బీఆర్ఎస్ కు విశ్వసనీయత లేకుండా పోతోందని స్పష్టం చేశారు. అచ్చోసిన ఆంబోతుల్లా కేటీఆర్, హరీష్ రావు తీరు ఉందన్నారు. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచెత్తి సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతోందని ఈ సమ్మిట్ ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాయిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉండనుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన మేథస్సును ఉపయోగించి తెలంగాణకు పెట్టుబడులు తెస్తున్నారని అన్నారు. కేటీఆర్ సూటు బూట్లు వేసుకుని షో చేయడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.






