Congress: మరోసారి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. ఆ నేతలే టార్గెట్ గా కాంగ్రెస్ సంచలన నిర్ణయం

by Prasad Jukanti |   (  Updated:2025-09-08 11:26:43  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ సంచలనంగా మారుతోంది.

Congress:  మరోసారి  కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. ఆ నేతలే టార్గెట్ గా కాంగ్రెస్ సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గతంలో కాంగ్రెస్ (Congress) కుటుంబంలో ఉండి అనివార్య కారణాల వల్ల పార్టీ మారిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఇవాళ గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ 22 నెలల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంపై చర్చించామన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలు, ఓటు చోరీకి సంబంధించిన అంశాలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇవాళ చర్చించామన్నారు.

బీఆర్ఎస్, బీజేపీకి స్కెచ్:

కాంగ్రెస్ ను వీడిన మారిన తిరిగి పార్టీలో చేర్చుకోబోతున్నామని మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ సాగుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ అంతర్గత విభేదాలతో సతమతం అవుతుంటే మరో వైపు బీజేపీ చేరికలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలను, కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్‌ వకులాభరణం కృష్ణమోహన్‌రావు ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొంత మంది నేతలు కాషాయ శిబిరంలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సైతం తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ పై (Operation Akarsh) దృష్టి సారించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూడాలి.

ఈ నెల 15న కామారెడ్డిలో సభ :

పీసీసీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం పొన్నం మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి కేంద్రంలో ఈ నెల 15న మహేశ్ కుమార్ గౌడ్ కు అభినందన సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ సభా వేదికగా బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తామన్నారు. బీజేపీ కడుపులో కొత్తులు పెట్టుకుని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటున్న తీరును ప్రజలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించామని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బిల్లును గవర్నర్ కు పపించామన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. పీసీసీ సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్ పై కూడా చర్చించామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కేటీఆర్ కు కౌంటర్:

కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఇది రాజకీయ విమర్శ అని గతంలో బీఆర్ఎస్ కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెబుతున్నారని దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని పొన్నం అన్నారు. ప్రభుత్వం సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మొదలైన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుళ్లాలని నిర్ణయించామన్నారు. ఎరువుల సరఫరాపై బీజేపీ బాధ్యత వహించేలా ప్రజల నుంచి ఒత్తిడి పెంచేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఎల్లంపల్లి రాష్ట్రానికి గుండెకాయలాంటిదని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. గోదావరి ఫేజ్- 1 కింద కృష్ణ , మంజీర నీళ్ళు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని ఇప్పుడు గోదావరి ఫేజ్ -2 కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొస్తుందన్నారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పేరు మార్చి తమ్మిడి హట్టి కాదని కాళేశ్వరం దగ్గర నిర్మించారని ధ్వజమెత్తారు.

Next Story