కేసీఆర్ అనగానే కాంగ్రెస్ నాయకులకు వణుకు మొదలైంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు.

కేసీఆర్ అనగానే కాంగ్రెస్ నాయకులకు వణుకు మొదలైంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అయ్యిందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం నుండి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting)ను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని, కేసీఆర్ (KCR) వచ్చి నిలదీస్తడు అనగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని వ్యాఖ్యానించారు. అందుకే అడుగు అడుగున పోలీసు ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించింది దుర్మార్గ సర్కారు అని, సభా స్థలికి కార్యకర్తలు చేరకుండా 10,15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారని ఆరోపించారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్ సహా అన్ని దారుల్లో వచ్చే వాహనాలను ఎక్కడికికక్కడ అడ్డుకున్నారని, ట్రాఫిక్ జాం పేరిట సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపారని అన్నారు.

ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నుండి వచ్చే దాదాపు 1000 పైగా వాహనాలను హుస్నాబాద్ దాటిన తర్వాత కొత్తపల్లి నుండి యూటర్న్ చేసి తిరిగి సిద్ధిపేట వైపు మళ్ళించారని తెలిపారు. ఆర్టీవో అధికారులను అడుగడుగునా పెట్టి వాహనాలు చెక్ చేయించారని, స్కూల్ బస్సులు అద్దెకు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. అంతేగాక బీఆర్ఎస్ సభను ఎలాగైనా అడ్డుకోవాలని దుష్టపన్నాగాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, సహాయ నిరాకరణ చేసి సభను ఫెయిల్ చేసే కుట్ర చేసిందని మండిపడ్డారు. సభకు వచ్చే అన్ని రహదారులను దిగ్బంధం చేసి సంకుచిత బుద్ధిని మరోసారి కాంగ్రెస్ బయట పెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Activists) పటాపంచలు చేశారని, తండోపతండాలుగా తరలివచ్చి గులాబీ జెండా (Gulabi Flag) సత్తా చాటారని పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ప్రజలను నమ్మించి నయవంచన చేసిన మీ మోసపూరిత వైఖరికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైనదని హెచ్చరించారు. సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, టీవీల్లో లక్షల సంఖ్యలో వీక్షించిన తెలంగాణ బిడ్డలకు మరొక్కసారి ధన్యవాదాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాసుకొచ్చారు.

Next Story