ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేను.. ఆరోజే రాజీనామా చేస్తా: జీవన్ రెడ్డి ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-22 11:12:17  IST  )

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేను.. ఆరోజే రాజీనామా చేస్తా: జీవన్ రెడ్డి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈనెల 25న (మార్చి 25, 2026) తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు.


బుజ్జగింపులు విఫలం..

జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి గంటకు పైగా చర్చలు జరిపారు. పార్టీ వీడవద్దని, హైకమాండ్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, జీవన్ రెడ్డి మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. ‘ఆత్మాభిమానం చంపుకొని, అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేను. మీకో దండం.. మీ పార్టీకో దండం. పార్టీలో గౌరవం లేని చోట ఉండటం కంటే బయటకు రావడమే మంచిదని నిర్ణయించుకున్నాను.’ అని మంత్రులకు జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అసంతృప్తికి కారణం..

బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు పార్టీలో మరియు ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. గత 20 నెలలుగా తన అనుచరులు, కార్యకర్తలు పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తనకు కనీస గౌరవం దక్కడం లేదని ఆయన మనస్తాపం చెందారు. రాజీనామా అనంతరం జీవన్ రెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. మరోవైపు ఆయన త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలను అనుచరులు తొలగించడం గమనార్హం.

కేసీఆర్ కు దూరదృష్టి లేక అప్పులపాలు చేశారు : మహేష్ కుమార్ గౌడ్

Next Story