Congress: దానంతో ఆగమాగం..! కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే కిరికిరి

by Shiva |
Congress: దానంతో ఆగమాగం..! కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే కిరికిరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌ పీఠంపై పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు చర్చనీయాశంగా మారింది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారనే పేరున్న దానం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిత్యం ఏదో రకంగా సొంత పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో దానం వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతున్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఎమ్మెల్యే మాటల యుద్ధానికి దిగుతుండటం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతోంది. తాజాగా ఖైరాతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా పుట్‌పాత్‌పై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టిన హైడ్రాకు దానం షాకిచ్చారు. దావోస్ నుంచి సీఎం వచ్చేవరకు కూల్చివేతలు ఆపాలని అధికారులపై ఫోన్‌లోనే విరుచుకుపడ్డారు. ఇలా వరుస ఘటనలతో ఆయన ఇంతకు కాంగ్రెస్ పార్టీ లైన్‌లోనే ఉన్నారా లేదా అనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతున్నాయి.

హైకమాండ్‌కు తలనొప్పిగా..

దానం నాగేందర్‌ది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ అని అందరూ చెబుతుంటారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన నైజం అనే టాక్ ఉంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కారెక్కేశారు. అక్కడ పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి వెనుక దానం స్వీయతప్పిదాలే ఎక్కువ ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే దానం తీరు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్‌లోనూ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఫార్ములా ఈ-కేసులో కేటీఆర్‌ను సమర్థించేలా కామెంట్స్ చేయడంతో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

నేను రాష్ట్ర నాయకుడిని..

తాజాగా గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించిన దానం.. కుమారి ఆంటీ క్యాంటీన్ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని, ఆమెకు ఓ న్యాయం సామాన్యులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని, నియోజకవర్గానికే పరిమితం కానని, తాను ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగానని చెప్పారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వం నిలబడదని, బ్యూరోక్రసీ కంట్రోల్‌లో పని చేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ రేపు మరోచోట ఉంటారని, వారికి ఏం బాధ్యత ఉండదని వ్యాఖ్యానించారు. అయితే విధినిర్వహణలో తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పదే పదే చెబుతున్న తరుణంలో దానం నాగేందర్ అధికారులపై చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దానం వ్యవహార తీరుపై దావోస్ నుంచి వచ్చాక సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Next Story