కొత్తవారికి ‘డీసీసీ’ బాధ్యతలు.. ప్రస్తుత అధ్యక్షుల్లో చాలా మంది మార్పు

by Gantepaka Srikanth |

నెలాఖరులోగా డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపిక పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తును వేగవంతం చేసింది.

కొత్తవారికి ‘డీసీసీ’ బాధ్యతలు.. ప్రస్తుత అధ్యక్షుల్లో చాలా మంది మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నెలాఖరులోగా డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపిక పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తును వేగవంతం చేసింది. అయితే ఇప్పుడున్న పాత అధ్యక్షుల్లో అత్యధికులను మార్చి, కొత్త వారికి అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ సారి నామినేటెడ్ విధానంలో కాకుండా.. జిల్లా స్థాయి నాయకుల అభిప్రాయాలు సేకరించి అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. దీని కోసం జిల్లాకు ఒక ఏఐసీసీ పరిశీలకుడిని నియమించనున్నారు. దీంతో 35 జిల్లాలకు 35 మంది కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు రానున్నారు. వీరికి జిల్లా, పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన పరిశీలకులు సహకరించనున్నారు. నెలాఖరుకల్లా పార్టీ, ప్రభుత్వంలోని ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ఇటీవల పీఏసీ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆదేశించగా.. అందుకనుగుణంగా ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 15కల్లా డీసీసీ అధ్యక్షులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక వారం అటూ ఇటూ అయినా.. నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షులను నియమించాలనే పట్టుదలతో ఉన్నారు.

‘డీసీసీ’ సూచించే పేర్లకు ప్రాధాన్యత

డీసీసీలకు పూర్వవైభవం తీసుకరావడం ద్వారా పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతుందని ఏఐసీసీ అంచనా వేసింది. దీనిలో భాగంగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో డీసీసీ అధ్యక్షులతో సమావేశాలను నిర్వహించింది. స్థానిక సంస్థలు, చట్టసభలకు పోటీ చేసే వారిని డీసీసీ స్థాయిలోనే ఖరారు చేయాలని, వారు పంపించే పేర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ పేర్ల నుంచే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకులు.. ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకులు, గెలివలిగే నాయకుల పేర్లు వస్తాయని, ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించడం వల్ల సరైన ఫలితాలు రావడంలేదని గుర్తించారు. దీంతో ఇకపై డీసీసీలు కీలకానున్నాయి. దీనిలో భాగంగానే డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఏఐసీసీ పరిశీలకులుగా పంపించనున్నారు. అక్కడ వారు సమావేశాలు నిర్వహించి, ఆ జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరించి.. ఏఐసీసికి నివేదిస్తారు. అనంతరం వారిని ఖరారు చేస్తారు. ఇదంతా పూర్తయితే మంచి ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

ప్రభుత్వ హోదాల్లో 14 మంది డీసీసీలు

మొత్తం 14 మంది డీసీసీ అధ్యక్షులు వివిధ హోదాల్లో ప్రభుత్వ పదవులు పొందారు. డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఎనిమిది మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామ్ఠాకూర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ శాసనమండలి సభ్యుడిగా, సికింద్రాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న కొక్కిరాల సురేఖ భర్త ప్రేమ్సాగర్ రావు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి టీఎస్ఐఐసీ చైర్మన్ గా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి టీఎస్యూఎఫ్ఐడీసీ చైర్మన్గా, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య టీఎస్ఎఫ్డీసీ చైర్మన్గా నియమితులయ్యారు. వీరిలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రిగా, వంశీకృష్ణ, నాయిని రాజేందర్ రెడ్డిలకు పీసీసీలో స్థానం దక్కింది. ఆది శ్రీనివాస్ విప్ గా నియమితులయ్యారు.

కొత్త వారి నియామకంతో ఉత్సాహం

ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులందరూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియామకమైన వారే. రాష్ట్రంలోని 14 డీసీసీలకు అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉండడంతో.. వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. రాజధాని మినహా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 35 జిల్లా కమిటీలు ఉన్నాయి. హైదరాబాద్ ను మూడు జిల్లాలుగా విభజించనున్నారు. చాలా మంది శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నందున డీసీసీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. సమయం కేటాయించలేకపోతున్నారు. పలువురిని పీసీసీ కార్యవర్గంలోకి తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులుగా తప్పించాలనే నిర్ణయంలో భాగంగానే కొందరిని పీసీసీ కార్యవర్గంలోకి తీసుకున్నారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. కొత్త వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించడం ద్వారా ఉత్సాహంతో పనిచేయగలుగుతారని, పూర్తి స్థాయి సమయం కేటాయించడం ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లగలుగుతారని భావిస్తున్నారు. రాష్ట్రంలోని అత్యధిక డీసీసీ అధ్యక్షులుగా కొత్త వారు రానున్నారని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. మార్చాలనే నిర్ణయం జరిగిందని, ఏఐసీసీ పరిశీలకులు వచ్చి, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి, జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరించి ఎవరిని నియమించాలో ఏఐసీసీ నివేదిస్తారని తెలిపారు.

Next Story