- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖాళీ కాబోతున్న ఐదు ఎమ్మెల్సీలు.. వారికే అవకాశం అంటూ తేల్చిచెప్పిన CM రేవంత్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశాలు లేవని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పినట్టుగా సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశాలు లేవని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పినట్టుగా సమాచారం. కష్టపడ్డ వారికి, యువతరానికి అవకాశాలు అంటూ సీఎం రేవంత్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కొద్ది కాలం క్రితం జరిగిన పీఏసీ సమావేశంలో రాబోయే 20 ఏండ్ల పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త తరానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశాలు దక్కబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల చివరి నాటికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఐదు ఖాళీ కానున్నాయి. వీరందరు కూడా బీఆర్ఎస్‌కు చేందిన వారే. వీరిలో మహమూద్‌అలీ, సత్యవతి రాథోడ్, శేరి శుభాష్‌రెడ్డి, యెగ్గే మల్లేశం, ఎంఐఎంకు చెందిన ఇఫెండిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్‌కు ఒకటి దక్కే అవకాశాలున్నాయి.
ఆశావహుల ప్రయత్నాలు షురూ
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సమయంలో సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని ఒప్పందం జరిగిందని, రెండింటిలో కనీసం ఒక్కటి అయినా ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మండలి గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నిక, కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటి నుంచే అశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీపీఐ నుంచి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పల్లా వెంకట్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో సీట్లు ఎవరికి అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగుతుందని, అదే కాంగ్రెస్ విధానం అని నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగా 3 సీట్లలో 3 ప్రధాన సామాజికవర్గ నేతలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా పార్టీ ముఖ్య లీడర్ల ద్వారా తెలిసింది. ఒక సీటు రెడ్డి, మరొకటి ఎస్సీ లేదా ఎస్టీ, మరొకటి బీసీలకు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భర్తీ చేసిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు రాలేదని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో ఈ సారి ఆయా వర్గాల నుంచి ఒకరికి సీటు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు. మరొకటి బీసీలకు ఖాయంగా కనిపిస్తోంది. సీటు ఆశించే వారిలో అనేక మంది ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పొంది ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. దీంతో టికెట్ పొందని వారు తమ పరిస్థితి ఏంటని, వారికి టికెట్ ఇచ్చారు, వారికే ఎమ్మెల్సీలు కూడానా? అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
యువతరానికే ప్రాధాన్యత
కాంగ్రెస్ అధిష్టానంలోని కీలక లీడర్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పోటీ తగ్గింది. పార్టీ యువతరానికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనిలో భాగంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన వారు సైతం తమకు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటి వరకు ఏ పదవి దక్కని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్, సిద్దేశ్వర్, దొమ్మటి సాంబయ్య, ఎస్టీల నుంచి రాములు నాయక్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఇప్పటికే ముస్లింలకు ఇచ్చినందుకు మళ్లీ ఆ వర్గాలకు సీటు ఇస్తారా? అనేది పార్టీ ఆలోచించాల్సి ఉంది. పార్టీ భవిష్యత్‌కు యువత ముఖ్యమని భావించిన అధిష్టానం.. అదే కోణంలో ఇప్పటి వరకు బల్మూర్ వెంకట్, అనిల్ కుమార్ యాదవ్‌కు పదవులు ఇచ్చారని, అదే విధానంలో సామ రామ్మోహన్‌రెడ్డి, అద్దంకి దయాకర్ లాంటి వారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






