- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రంపై కాంగ్రెస్ సర్కార్ సమరశంఖం.. బీసీ బిల్లు ఆమోదంలో జాప్యంపై ‘చలో ఢిల్లీ’
బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది.

బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సర్కారు చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. సీఎం సహా పార్టీ ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడంతోపాటు రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. సోమవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు బీసీ సంఘాలు, బీసీ మేధావులు ఢిల్లీకి రావాలని, బిల్లు ఆమోదానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. మార్చి 17న రాష్ట్ర అసెంబ్లీ, 18న కౌన్సిల్ ఆమోదించిన ఈ రెండు ఈ బిల్లులను 22న గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిందని మంత్రి తెలిపారు. అదే నెల 30వ తేదీన ఆ బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపించారని.. అయితే, ఇప్పటికీ రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని.. కేంద్రం తీరు వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని మంత్రి విమర్శించారు. - దిశ, తెలంగాణ బ్యూరో
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే నెలలో మూడు రోజులపాటు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఢిల్లీలోనే మకాం వేయాలని డిసిషన్ తీసుకున్నది. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు, మేధావులు కలిసి రావాలని పిలుపునిచ్చింది. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. పాలకవర్గాలు లేకపోవడంతో స్థానిక సంస్థలకు కేంద్రం కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. దీంతో స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను వెంటనే ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను సైతం రూపొందించినట్లు తెలిపారు. ఎంపిరికల్ డేటా ఉంటే 50 శాతం కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఇంద్రాణి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తిరిగి బీసీ జనాభా వివరాలను సేకరించిందని తెలిపారు. ఆ డేటా ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేయాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
మూడు రోజులు ఢిల్లీలోనే..
బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జాప్యంపై నిరసన తెలియజేసేలా ఆగస్టు 5న పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పొన్నం తెలిపారు. ఆగస్ట్ 6న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా దాదాపు 200 మంది ప్రజాప్రతినిధులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని డిసిషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆగస్ట్ 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, లోక్ సభలో ప్రతిపక్ష నేత ద్వారా ప్రయత్నిస్తామన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుపుకొని వంద మందికి పైగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు సహా, రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలిపారు. ఈ తేదీల్లో ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీగా ఏ విధంగా పోరాడామో.. రిజర్వేషన్ల సాధనకు బీసీ మేధావులు, నాయకులు, కుల సంఘాలు అలాగే పోరాడాల్సిన అవసరముందన్నారు.
పెండింగ్‌లోనే బిల్లులు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలని ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించిందని మంత్రి పొన్నం గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును అదే రోజున ఆమోదించామన్నారు. మార్చి 17న అసెంబ్లీ, 18న కౌన్సిల్ ఆమోదించిన ఈ రెండు ఈ బిల్లులను.. మార్చి 22న గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిందని తెలిపారు. మార్చి 30న ఈ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారన్నారు. ఇప్పటికీ ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయంపైనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముడిపడి ఉందన్నారు. మూడు నెలల్లోఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఆదేశించినందున.. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కేసీఆర్ చేసిన చట్టాలే అడ్డంకి
పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ బీసీలకు తీరని ద్రోహం చేశారని పొన్నం విమర్శించారు. అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేక నిబంధనను పొందుపరిచారని గుర్తు చేశారు. కేసీఆర్ తెచ్చిన ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. దీంతో ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని గత కేబినెట్ మీటింగులోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ నిబంధనను ఎత్తివేసేలా సవరణ ఆర్డినెన్స్ ఫైల్ ను జులై 14న ప్రభుత్వం గవర్నర్ కు పంపించిందన్నారు. ఈ ఆర్డినెన్స్ ఫైలును కూడా గవర్నర్.. రాష్ట్రపతి పరిశీలనకు పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందిందన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్ ను వెంటనే ఆమోదించాలని రాష్ట్ర కేబినేట్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడంతోపాటు.. జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుందన్నారు.
బీజేపీ ఎంపీలు సహకరించాలి
రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులకు ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మంత్రి పొన్నం కోరారు. బీజేపీకి చెందిన బీసీ ఎంపీలు అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, లక్ష్మణ్ దీని కోసం కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీసీ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఆర్ కృష్ణయ్య అంటే గౌరవం ఉందని, అయితే ఆయన మౌనంగా ఉండొద్దని కోరారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించాలని కోరారు. బీజేపీకి చెందిన బీసీ ఎంపీలను తీసుకురావాలని సూచించారు.
అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులు రద్దు
రవాణా శాఖకు సంబంధించి రాష్టంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయని, జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్ పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సూచించిందన్నారు. చెక్ పోస్టులపై సిబ్బందితో కాకుండా ఇకపై వాహన్, అడ్వాన్స్ డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతుందన్నారు. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.






