- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్‌ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ పాలకుల దారిలో నడుస్తోందనే భావన ప్రజల్లో బలపడుతోందని, కొత్త ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల డీపీఆర్‌లు తయారు చేస్తూ, ప్రజల సంక్షేమం కన్నా తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ పాలకుల దారిలో నడుస్తోందనే భావన ప్రజల్లో బలపడుతోందని, కొత్త ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల డీపీఆర్‌లు తయారు చేస్తూ, ప్రజల సంక్షేమం కన్నా తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని మరింత అప్పుల బారిన పడేస్తూ, ప్రజలపై భారం మోపే పరిస్థితి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మక్క, జొన్నతో పాటు ఇతర పంటలను కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ హామీలను నిలబెట్టుకోలేక రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు సరైన సమాచారం ఇవ్వకుండా, కొనుగోళ్లలో ఆలస్యం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులను మోసం చేయడం మానుకొని, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మోసపూరిత రాజకీయాలను ఇక నమ్మవద్దని కోరారు. ప్రధాని మోడీ 12 ఏళ్లుగా దేశానికి నిజాయితీ, అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక అవకాశం ఇస్తే పారదర్శకతతో కూడిన, అవినీతి రహితమైన, ప్రజల సంక్షేమాన్ని ముందుంచే పరిపాలన అందిస్తామన్నారు.






