- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పుట్టగా మారింది : బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి.. ఈ-రేసింగ్ కార్ల కేసుల్లో ఇప్పటివరకు పురోగతి ఏది అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి.. ఈ-రేసింగ్ కార్ల కేసుల్లో ఇప్పటివరకు పురోగతి ఏది అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు రాగం బారెడు, పని మూరెడు అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ‘ములాఖత్’ జరిగిపోయిందనే అనుమానం ప్రజల నుంచి వినిపిస్తున్నదని పేర్కొన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర ప్రముఖులతోపాటు తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు స్వయంగా ఫోన్ ద్వారా తెలియజేశారని అన్నారు. ఆ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి హాజరుకావాలని వారు తెలిపారు. సామాన్యుల నుంచి ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నాయకుల వరకూ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లాభాలు పొందేందుకు, వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు, సెటిల్మెంట్లు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
ఈ విధమైన నీచ రాజకీయాలకు దిగజారిన బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సాగదీయడమేనా? లేక దానిని తుదిదశకు తీసుకెళ్తారా? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు దోషులను పట్టుకుంటారా? అంతర్గత ఒప్పందాలు నడుస్తున్నాయా? అని ప్రశ్నించారు. సిట్ ఖచ్చితమైన నివేదిక ఇవ్వాలని.. ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడేలా తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.
రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలి
రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని.. కానీ కాంగ్రెస్ పార్టీ, గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నదని ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని.. ఇప్పుడు ఆ హామీ అమలు చేసే పరిస్థితిలో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నెపంగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా, బీజేపీ పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు.
స్థానిక సంస్థల కమిటీతో పాటు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, అసెంబ్లీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయిల వరకు ఇంచార్జ్‌లు, పోటీచేస్తున్న అభ్యర్థులను సమాయత్తం చేయడానికి మరో సమావేశాన్ని త్వరలో నిర్వహించడం జరుగుతుందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కిందని.. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని చెప్పారు.






