జెడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

by Ajay Maddhiboyina |

తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న జెడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా దృష్టి సారించింది.

జెడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న జెడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ, మున్సిపల్, మున్సినల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఇదే విజయోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ఎన్నికలపైన దృష్టి సారిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లపై పార్టీ ముఖ్యలు ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లో పార్టీని సమన్వయం చేసేందుకు డీసీసీ చీఫ్‌లు కీలకమన్న భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 21 నుంచి నూతన డీసీసీలకు 10 రోజుల పాటు వికారాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరవుతారని టీపీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్టీ బలోపేతంతోపాటు అనేక అంశాలపై డీసీసీ చీఫ్‌లకు అగ్రనేతలు దిశా నిర్దేశం చేయనున్నారు.

నేడు ఢిల్లీలో ఏఐసీసీ నేతల సమీక్ష..

అన్ని రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై ఏఐసీసీ సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ చేరుకోగా మీటింగ్‌కు టీపీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్ గౌడ్, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సైతం హాజరుకానున్నారు. పార్టీ నిర్మాణం, సంక్షేమంపైనా సమావేశంలో చర్చ ఉంటుందని పీసీసీ చీఫ్ చెప్పారు. సమావేశంలో వరుస ఎన్నికల్లో పార్టీ నమోదు చేసుకున్న విజయాల పట్ల సమీక్ష ఉంటుందని, దీంతోపాటు ప్రభుత్వం, పార్టీలోని నేతల పనితీరు, నేతల మధ్య విభేదాలపైన చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పెద్దలు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలతో మాట్లాడనున్నట్లు తెలిసింది.

Next Story