‘స్థానిక’ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్.. రెండు బహిరంగ సభలకు ప్లాన్

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

‘స్థానిక’ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్.. రెండు బహిరంగ సభలకు ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఒక సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మరో సభకు రాహుల్ గాంధీని చీఫ్ గెస్టులుగా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 19న ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్స్ పై మరోసారి కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

‘రైతు భరోసా’ తరువాత మీటింగ్స్

వానాకాలం రైతు భరోసా స్కీమ్ కింద ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 6వేల చొప్పున పంటసాయం అందిస్తోంది. తొమ్మిది రోజుల్లో రైతులందరికీ నిధులు చెల్లించేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మూడుకరాల విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈనెల చివరి వరకు రైతు భరోసాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి రెండు భారీ సభలకు ప్లాన్ చేస్తున్నది. అయితే ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు ఈ సభలను పూర్తి చేస్తే ప్రజల్లో ఉన్న నెగిటివ్ పోవడంతో పాటు పార్టీ కేడర్ కు బూస్టింగ్ వస్తుందని భావిస్తోంది.

విపక్షాలు బలంగా ఉన్న జిల్లాల్లో సభలు

నిజానికి మూడు నాలుగు నెలల క్రితమే రెండు పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. ఎస్సీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించినందుకు ఖర్గే చీఫ్ గెస్ట్ గా ఒక సభ, బీసీ కులగణన పూర్తి చేసినందుకు రాహుల్ చీఫ్ గెస్ట్ గా మరో మీటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ ఇద్దరు నేతలకు సమయం కుదరకపోవడంతో వాయిదా పడినట్లు పార్టీ వర్గాల్లో టాక్ ఉంది. అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభలు నిర్వహించడం వల్ల పార్టీకి మైలేజ్ వస్తుందని ఆశిస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ బలంగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక సభ, బీజేపీకి పట్టు ఉన్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ ఏరియాల్లో మరోసభ నిర్వహించాలనే యోచనలో రాష్ట్రనేతలు ఉన్నారు.

Next Story