Congress: ప్రతీ రూపం తెలంగాణ తల్లి స్వరూపమే.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-12-14 14:58:11.0  )
Congress: ప్రతీ రూపం తెలంగాణ తల్లి స్వరూపమే.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రూపం ఏదైనా ప్రతీ రూపం తెలంగాణ తల్లి స్వరూపమేనని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మూడు రూపాలలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను పోస్ట్ చేశారు. దీనిపై 2007ల నాడు, 18 సంవత్సరాల క్రితం తెలంగాణ పోరాటంలో మా ఉద్యమకారులం, సమైక్య పాలనలో గుండె నిండా జై తెలంగాణ అని నినదిస్తూ, ప్రాణమెత్తుగా కొట్లాడుతూ.. ఎన్నో నిర్బంధాలను దాటుకుంటూ, మా తల్లి తెలంగాణకు ఏర్పాటు చేసుకున్న రూపమే ఆ మొదటి విగ్రహ ఆవిష్కరణ అని వ్యాఖ్యానించారు.

అనంతరం టీఆర్ఎస్ రూపు దిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం, ఇయ్యాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న విగ్రహం.. రూపం ఏదైనా తెలంగాణ బిడ్డల బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతస్మరణీయమేనని అన్నారు. అంతేగాక అమ్మోరు తల్లి లెక్క నూరు రూపాలైనా.. ఏ రూపంలో ఉన్నా.. ప్రతి రూపం మన తెలంగాణ తల్లి ప్రతిరూపమేనని విజయశాంతి రాసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ నాయకులు.. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన విగ్రహంపై కాంగ్రెస్ నాయకులు తెగ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కాంగ్రెస్ నేతలకు బిన్నంగా వ్యాఖ్యానించడం కారణంగా విజయశాంతి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed