- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: జూబ్లీహిల్స్ బైపోల్‌పైనే అందరి దృష్టి.. గెలిచే అవకశాలు ఎవరికి ఎక్కువున్నాయో తెలుసా?
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇప్పుడు అందరి దృష్టి ఉప ఎన్నికపై పడింది. ఏ పార్టీలో చూసినా ఇదే చర్చ నడుస్తు్న్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇప్పుడు అందరి దృష్టి ఉప ఎన్నికపై పడింది. ఏ పార్టీలో చూసినా ఇదే చర్చ నడుస్తు్న్నది. బై పోల్‌ను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుండగా.. ఎలాగైనా పాగా వేయాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. ఇక సిట్టింగ్ స్థానాన్ని సెంటిమెంట్‌తో దక్కించుకునేందుకు గులాబీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మూడు పార్టీల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ముందుకు వస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలను కలుస్తూ తమకే సీటు ఇవ్వాలని ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
జూబ్లీహిల్స్ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, సీఎం రేవంత్రెడ్డిప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలిచేలా ప్రణాళిక రచిస్తున్నారు. దీని కోసం సర్వేలు చేపడుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి వరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీనిని రాజకీయ విశ్లేషకులు సైతం నిర్ధారిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వంపై జరుగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఉప ఎన్నిక సరైన వేదిక అని కాంగ్రెస్ భావిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఉప ఎన్నికపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని, అక్కడున్న పరిచయాలను పార్టీకి అనుకూలంగా మలిచేలా ప్రయత్నం చేయాలని తనను కలిసిన ముఖ్య నేతలకు సూచిస్తున్నారు. అభ్యర్థి విషయంలో ప్రచారం, గందరగోళం వద్దని, దీని ద్వారా పార్టీకి డ్యామేజ్ అవుతుందని నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నట్టు నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం సర్వే
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పలు సర్వేలు చేయిస్తున్నట్టు తెలిసింది. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్‌తో పాటు 2023 ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి ఓడిన బండి రమేష్ పేర్లపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నది. అజార్‌కు టికెట్ ఇవ్వడంపై మజ్లీస్ అభ్యంతరం తెలిపే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. నవీన్ యాదవ్ గతంలో మజ్లీస్ టికెట్‌పై జూబ్లీహిల్స్‌లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే ఎంఐఎం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందోననే చర్చ జరుగుతున్నది.
పాగా వేసేందుకు ‘కమలం’ ప్రయత్నాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొంది ఎలాగైనా ఆ ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అనేక మంది ఆశావహులు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నట్టు తెలుస్తున్నది. సామాజికవర్గ బలం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీలో ఉంటే విజయం సాధిస్తామా? అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బలహీనతలను గుర్తించేందుకు ప్రైవేటు ఏజెన్సీలను రంగంలోకి దింపారు. ఇప్పటికే సగానికి పైగా సర్వే కంప్లీట్ అయినట్టు నేతలు చెప్పారు. అన్నీ అనుకూలిస్తే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రచారంలో ముందుండాలని ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.
ప్రచారంలో ముగ్గురి పేర్లు
బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన దీపక్‌రెడ్డితో పాటు బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, గౌతమ్‌రావు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా మరికొందరు నేతలు సైతం టికెట్ ఆశిస్తూ సర్వేలు చేయించుకుంటున్నట్టు తెలుస్తున్నది. అర్బన్సీటు కావడంతో కాషాయ పార్టీకి కొద్దో గొప్పో బలం ఉంటుందని, అధికార, ప్రతిపక్ష పార్టీలకు జనంలో ఉన్న వ్యతిరేకత తమ గెలుపునకు సహకరిస్తాయని వారు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సులభంగా గెలుపొంది మేయర్సీటు దక్కించుకోవచ్చనే అంచనాల్లో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తున్నది. మరో వైపు మజ్లిస్బరిలో ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు చీల్చే అవకాశముందని దీని వల్ల బీజేపీకి మేలు కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ ఆశలు
జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి తమ ఖాతాలోనే వేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు ఆ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ భార్యకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇలా చేస్తే సానుభూతి కలిసొస్తుందని పార్టీ భావిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ సైతం ఇదే డెసిషన్‌కు వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గోపీనాథ్ అదే నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఆ అసెంబ్లీలో ఆయనకు మంచి పట్టు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి గెలుపు సాధించాలని గులాబీ నేతలు జూబ్లీ పోరుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.






