Sridhar Babu: బుగ్గపాడులో మౌలిక వసతులు పూర్తి చేయండి

by Gantepaka Srikanth |

Sridhar Babu: బుగ్గపాడులో మౌలిక వసతులు పూర్తి చేయండి

Sridhar Babu: బుగ్గపాడులో మౌలిక వసతులు పూర్తి చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గపాడు పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మంగళవారం టీజీఐఐసీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బుగ్గపాడులోని 200 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కు, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, ఎంఎస్ ఎంఈ జోన్‌లను టీజీఐఐసీ ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నందున త్వరితగతిన ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని సూచించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో జనవరిలో పరిశ్రమల నిర్మాణాలు మొదలయ్యేలా చూడాలని ఆదేశించారు. మెగా ఫుడ్ పార్కుకు కేటాయించిన 60 ఎకరాల్లో యూనిట్ల నిర్మాణాలను ప్రారంభించేలా భూకేటాయింపులు పొందిన వారిని కోరాలని తెలిపారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను 80 ఎకరాలు, ఎంఎస్ ఎంఈ జోన్‌ను 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో కొత్తగా వ్యవసాయ, అక్వారంగ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్‌కుమార్, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, డైరెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

గేమ్ చేంజర్ కానున్న ఫుడ్ పార్క్

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ వ్యయం రూ.109 కోట్లని.. అందులో రూ.99 కోట్లు ప్రాజెక్ట్ వ్యయం కాగా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి రూ.28 కోట్లు గ్రాంట్ ఇచ్చారన్నారు. ప్రస్తుతం 26 ఎకరాల్లో 26 ప్లాట్స్‌లో పలు కంపెనీలకు ప్లాట్స్ కేటాయించారని తెలిపారు. రూ.615 కోట్ల దీపక్ నెక్స్ జెన్ పెట్టుబడులతో 3,200 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయన్నారు.

Next Story