- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ ఉద్యోగుల ఎన్నికల బదిలీలు పూర్తి చేయండి : ట్రెసా
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసి ఏండ్లు గడుస్తుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసి ఏండ్లు గడుస్తుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఎన్నికల ముందు జరిగే ప్రక్రియే. కానీ తిరిగి పూర్వపు జిల్లాలకు బదిలీ చేయడం లేదని ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్‌లు అన్నారు. 20 నెలలుగా బదిలీలు లేకపోవడం వల్ల తహశీల్దార్లు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారన్నారు. బుధవారం తమ సమస్యలను పరిష్కరించాలని సీసీఎల్ఏకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే మానసిక వేదనకు గురై కామారెడ్డి జిల్లాలో ఓ తహశీల్దార్ మరణించారన్నారు. చాలా సార్లు ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ చేసిన 26 మంది డిప్యూటీ తహశీల్దార్లను కూడా తిరిగి పంపాలన్నారు. జీవో 317లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన అన్ని కేడర్ల సిబ్బందిని స్థానికత ఆధారంగా పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. ప్రమోషన్ల సమయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు, నాయబ్ తహశీల్దార్లను, తహశీల్దార్లను సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు పంపినట్లు చెప్పారు. గతంలో ఇతర శాఖలకు బదిలీ చేసిన 5400 మంది వీఆర్వోలను వారి అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొని పదో తరగతి ఉత్తీర్ణతతో సహా పూర్తి స్థాయిలో మాతృ శాఖకు తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నాలుగేండ్లుగా మరణించిన వీఆర్ఏ కుటుంబాలకు కారుణ్య నియామకాలు పెండింగులో ఉన్నాయని, వారి కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కూడా పెండింగులో ఉందన్నారు. 55 నుంచి 61 సంవత్సరాల వీఆర్ఏల విషయంలో వారి వారసులకు అవకాశం ఇవ్వాలని కోరారు.
రెగ్యులరైజేషన్ భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ చేసిన వీఆర్ఏలను, ఆఫీసు సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలి. వివిధ పేర్లతో రెవెన్యూ శాఖలో పని చేస్తోన్న కంప్యూటర్ ఆపరేటర్లను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో తమ డిమాండ్లకు తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ట్రెసా రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ కి వినతి పత్రం సమర్పించారు.






