పీఏసీఎస్ కేంద్రాలపై ఫిర్యాదులు.. ఐకేపీలకే ప్రాధాన్యం

by Naga Rani Yarlagadda |

ఖరీఫ్ సీజన్ వరి కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఈసారి ఐకేపీ సెంటర్లకే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు కేటాయించనున్నట్లు తెలిసింది.

పీఏసీఎస్ కేంద్రాలపై ఫిర్యాదులు.. ఐకేపీలకే ప్రాధాన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖరీఫ్ సీజన్ వరి కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఈసారి ఐకేపీ సెంటర్లకే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు కేటాయించనున్నట్లు తెలిసింది. వరి కొనుగోళ్లలో నిబంధనలు పాటించడం లేదని పీఏసీఎస్ కేంద్రాలపై గతంలో ఫిర్యాదులు రావడంతో.. ప్రభుత్వం ఈసారి ఐకేపీలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా మహిళలకు ఉపాధి లభించడంతోపాటు కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని సంబంధిత శాఖ మంత్రి తెలిపారు. దీంతో ఐకేపీ కేంద్రాలకు వరి కొనుగోలు కేంద్రాల కేటాయింపులపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని సచివాలయంలో చర్చ జరుగుతున్నది.

పెరగనున్న కొనుగోలు కేంద్రాలు

గత ఖరీఫ్ లో రాష్ట్ర ప్రభుత్వం 7,140 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసింది. అయితే ఈ సారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను 8,350కు పెంచనున్నట్లు తెలిసింది. అందులో పీఏసీఎస్ కేంద్రాలకు 3,750, ఐకేపీలకు 4042, ఇతరులకు 558 కేంద్రాలు కేటాయించనున్నట్లు సమాచారం. కాగా, ఈ సీజన్ లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 160 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. అందులో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా రూ. 500 బోనస్ ఇస్తుండడంతో రైతులు సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపారు. అయితే గత రెండు సీజన్లకు సంబధించి బోనస్ పంపిణీలో కాస్త జాప్యం జరగడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసిన 10 రోజుల్లో కచ్చితంగా బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఏర్పాట్లు వేగవంతం

వానాకాలం కోతలు ఈనెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశముండడంతో కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో.. లోటు లేకుండా ఉండేందుకు సన్నవరి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించింది. ఈ సీజన్లో గ్రేడ్-ఏ రకం రూ. 2,389 కాగా, సాధారణ రకం వరి రూ.2,369తో కొనుగోలు చేయనుంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమను గుర్తించే యంత్రాలు, తూకం మిషన్లు అందుబాటులో ఉంచే చర్యలు చేపట్టింది. ఇప్పటికే రవాణా, అగ్రికల్చర్, పోలీసులతోపాటు ఐదారు శాఖలతో సమావేశం జరిపి.. కొనుగోళ్లకు సంబంధించిన విధివిధానాలు రూపొందించినట్లు తెలిసింది. ఈ సీజన్ లో రైతులు ఇబ్బందులు పడకుండా రంగుమారిన ధాన్యం, తేమ శాతం విషయంతో కొర్రీలు పెట్టకుండా జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే జిల్లా అధికారులు సూచనలు చేసినట్లు తెలిసింది.

ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా..

రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తుండడంతో.. కొందరు వ్యాపారులు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల రైతుల నుంచి సన్న వరి కొనుగోలు చేసి.. తెలంగాణలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వీటిపై ఫిర్యాదులు రావడంతో పౌరసరఫరాల శాఖ సరిహద్దుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు చెక్పోస్టులు పెట్టి పోలీసులను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నది. బోనస్ తో రైతుల కంటే ఎక్కువ దళారులే సంపాదించుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈసీజన్ లో బోనస్తెలంగాణ రైతులకే అందేలా చర్యలు తీసుకున్నట్లు పౌరసరఫరాల ఉన్నతాధికారి తెలిపారు.

Next Story