- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్రపు డెక్క, దోమల వ్యాప్తిపై ఫిర్యాదులు.. హైడ్రా ఫోన్ ఇన్‌కు 28 కాల్స్
హైడ్రా శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో నగరం నలుమూలల నుంచి విన్నాపాలు వచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నగరంలోని చెరువుల్లోకి మురుగు నీరు భారీగా వచ్చి చేరుతోంది. చెరువులు దుర్గంధభరితంగా మారాయి. గుర్రపు డెక్క వ్యాపించి దోమలకు కేంద్రాలుగా నగరంలోని చెరువులు మారాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల జాబితాలో మా ప్రాంత చెరువును కూడా చేర్చాలి’ అని హైడ్రా శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో నగరం నలుమూలల నుంచి విన్నాపాలు వచ్చాయి. చెరువులు, నాలాలు ఆక్రమణకు గురి కాకుండా చూసి వరదలు నివారించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. దాదాపు 28 మందితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా మాట్లాడి.. సమస్యలు తెలుసుకున్నారు. మురుగు నీరు కలవకుండా ఎస్‌టీపీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రామంతాపూర్ చిన్న చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని వెంటనే వీటిని ఆపి చెరువును కాపాడాలని స్థానికంగా ఉన్న ఓ మహిళ ఫోను చేసి కోరారు. బాచుపల్లి సర్వే నంబరు 54 లో 3 ఎకరాల వరకూ భూమి ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది.. దీనిని ప్రజావసరాలకు ఉపయోగపడేలా చూడాలని మరో వ్యక్తి కోరారు. ఓల్డ్ అల్వాల్, జొన్నబండలోని వజ్ర ఎన్‌క్లేవ్‌లో పార్కుల ఆక్రమణతో పాటు.. రహదారి ఆటంకాలను తొలగించాలని అక్కడి కాలనీ ప్రతినిధులు కోరారు.
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద పార్కింగ్ దందా..
ఎల్‌బీనగర్‌లో ఇళ్లు పొందిన కింది పోర్షన్ వారు వాహనాలకు పార్కింగ్ కోసం ఉంచిన స్థలాలను కలిపి అదనపు గదులు నిర్మిస్తున్నారని.. వెంటనే వాటిని తొలగించి నివాసితుల అందరి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. హెచ్ఏఎల్ కాలనీలోని ఖర్మన్‌కుంటలో మురుగు నీరు చేరి గుర్రపు డెక్క పెరుగుతుంది అభివృద్ధి చేయాలని కోరారు. నిజాంపేటలోని హిల్‌కౌంటీలో పత్తికుంటకు నాలుగు వైపులా రహదారులున్నాయి. దుర్గంధంతో నిండిన ఈ చెరువును అభివృద్ధి చేస్తే అందరికీ వినియోగంలోకి వస్తుందన్నారు. నల్లగండ్లలోని నల్లగండ్ల చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థకు ఉద్దేశించిన భూమిలో అక్రమ పార్కింగ్ దందా కొనసాగుతోందని ఫిర్యాదు అందింది. ఇలా శనివారం హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమానికి మొత్తం 28 ఫిర్యాదులందాయి. వీటిని త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.






