- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శామీర్‌పేట పెద్ద చెరువుపై మల్లారెడ్డి కన్ను.. తానే ఎమ్మెల్యే కావడంతో..!!
శామీర్‌పేట పెద్ద చెరువుపై మల్లారెడ్డి కన్ను.. తానే ఎమ్మెల్యే కావడంతో..!!

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయనో ఎమ్మెల్యే. నిస్వార్ధ సేవను మరిచారు. సహజ సంపదను భావితరాలకు అందించాల్సిన సదరు ప్రజాప్రతినిధి.. దాన్ని కలుషితం చేసేస్తున్నారు. తన స్వార్థం కోసం చెరువును చెరబడుతున్నారు. హోటల్ బిజినెస్ వల్ల విడుదల అవుతున్న మానవ వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నారు. తద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కే తలమానికంగా ఉన్న పెద్ద చెరువును మురికికూపంగా మార్చేస్తున్నారు. ఆయనే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాగా, డ్రైనేజీతో కాలుష్యకారకంగా మారుతున్నది శామీర్‌పేట పెద్ద చెరువు. చెరువులోకి వ్యర్థాలను రాకుండా అడ్డుకోని, రక్షించాల్సిన అధికార యంత్రాంగం ఆయన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. దీంతో మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట పెద్ద చెరువుకు కష్టమొచ్చింది.
చెరువుకు చెర
మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల కేంద్రాన్ని అనుకుని ఉన్న శామీర్ పేట పెద్ద చెరువు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న విశాలమైన చెరువుపై మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కన్ను పడింది. అలియాబాద్ చౌరస్తాలో చెరువును ఆనుకొని ఉన్న కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. గత ప్రభుత్వహాయంలో మంత్రిగా ఉన్నప్పుడు చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ స్థలాన్ని సైతం తన ఖాతాలోకి వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అదే మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అలియాబాద్ చౌరస్తాలో అనుమతులు లేకుండా సీఎంఆర్ పేరిట భారీ ఫంక్షన్ హాల్, వాణిజ్య భవనాన్ని నిర్మించి పిస్తా హౌజ్‌కు అద్దెకిచ్చారు. తాజాగా పిస్తా హౌజ్ పక్కనే కొత్తగా మల్లారెడ్డి ఎయిర్ సిటీ పేర ప్లై హైదరాబాద్, ఏరో ఎటరీ, సన్ సెట్ స్టోరీస్ కేప్, ప్లే జోన్, గో కార్డింగ్ గేమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
చెరువులోకి మురుగు..
సీఎంఆర్ ఫంక్షన్ హాల్, పిస్తా హౌజ్, కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్ సిటీ హోటళ్ల నుంచి వస్తున్న వ్యర్థాలను, మురుగునీటిని పక్కనే ఉన్న శామీర్ పేట పెద్ద చెరువులోకి కలుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ మురుగునీటికి ఎలాంటి స్టోరేజీ లేదని తెలుస్తోంది. మురుగునీరు కోసం కనీసం సంపు కూడా నిర్మించలేదని సమాచారం. నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినందున తనను ఎవరు ఏమి చేయరనే ధైర్యంతో డ్రైనేజీ, వ్యర్థాలను నేరుగా పైపులైన్ ద్వారా చెరువులోకి కలుపుతున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి నిర్వాహకంపై ఇప్పటికే మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆయన రాజకీయ పలుకుబడితో చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం జంకుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే మల్లారెడ్డి తీరు వల్ల మంచినీటితో కలకలలాడుతున్న శామీర్ పేట చెరువు త్వరలోనే కాలుష్యకారంగా మారనుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నల్సార్ విశ్వవిద్యాలయంతోపాటు, స్థానికంగా వెలిసిన కొన్ని భవనాల నుంచి సైతం శామీర్ పేట చెరువులోకి డ్రైనేజీ కలుస్తుందని వాపోతున్నారు. చెరువులోకి వ్యర్థాలు రాకుండా కట్టడి చేసి, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






