మునుగోడులో కమ్యూనిస్టులను కేర్ చేయట్లే.. ఓటింగ్‌లో షాకిచ్చేనా..?

by Disha Web |
మునుగోడులో కమ్యూనిస్టులను కేర్ చేయట్లే.. ఓటింగ్‌లో షాకిచ్చేనా..?
X

దిశ, నల్లగొండ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎన్నడూలేని విధంగా కమ్యూనిస్టులు ముక్తకంఠంతో మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికలో కమ్యూనిస్టులు తీసుకున్న స్ట్రాటజీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకానొక దశలో కమ్యూనిస్టు కార్యకర్తలు సైతం ఆ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు. కానీ సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకత్వంలోని అగ్రనేతలు చొరవ తీసుకుని మతతత్వ బీజేపీని పాతరేయాలంటే.. చేవలేని కాంగ్రెస్‌కు మద్దతు ఇయ్యడం కంటే.. గెలిచే అవకాశాలు ఉన్న టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం బెటరంటూ కమ్యూనిస్టు అగ్రనేతలు క్యాడర్‌కు సర్దిచెప్పారు. అసలే కమ్యూనిస్టు పార్టీ.. పైగా సిద్దాంతానికి కట్టుబడి ఉండే క్యాడర్.. ఇంకేముందు పార్టీ చెప్పిదంటూ మునుగోడు ఉపఎన్నికలో గులాబీతో దోస్తీ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 20 రోజులుగా కమ్యూనిస్టు కార్యకర్తలు టీఆర్ఎస్ శ్రేణులతో చెట్టాపట్టాలేసుకుని ప్రచారంలో మునిగిపోయారు. అయితే కమ్యూనిస్టులకు అసలు సమస్య ఎదురవుతోంది.

ప్రచారంలో పెరిగిపోయిన బాసిజం..

ఉపఎన్నిక ప్రచారంలో ప్రతి ఎంపీటీసీ పరిధికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనో.. ఎమ్మెల్సీనో.. మంత్రినో.. ఇన్‌ఛార్జిగా నియమించారు. సదరు ప్రజాప్రతినిధులే ఆ ఎంపీటీసీ పరిధిలోని గ్రామానికి సర్వం. ప్రచార ఖర్చు దగ్గరి నుంచి కార్యకర్తలకు భోజనాలు పెట్టించడం.. చోటా మోటా లీడర్లను కొనుగోలు చేయడం.. అంతా ఆయన బాధ్యతే. అయితే ఇందుకుగాను పార్టీ నుంచి పెద్దమొత్తంలో ఫండ్ వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సదరు ప్రజాప్రతినిధి తన వెంట అనుచరగణాన్ని వెంటపెట్టుకుని ఆయా గ్రామాల్లో మకాం వేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి డబ్బు పంచడం.. ఏమేం చేయాలో వారే కింది క్యాడర్‌కు సూచించడం వంటి పనులు అప్పగించారు. ప్రజాప్రతినిధే బాధ్యతలు అప్పగించాక.. అనుచరగణం ఊరుకుంటుందా..?. ప్రచారంలో ఏం చేయాలి..? ఎవరిని పార్టీలోకి లాక్కోవాలి..? ప్రచారానికి వచ్చిన ప్రజలకు ఎంత చెల్లించాలి..? ఆత్మీయ సమ్మేళానికి తరలించేందుకు ఎంతమందిని తీసుకెళ్లాలి..? తదితర బాధ్యతలన్నీ అనుచరగణమే చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. లోకల్ లీడర్లు, కార్యకర్తలపై బాసిజం విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా కమ్యూనిస్టు కార్యకర్తల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ప్రతి విషయంలో కమ్యూనిస్టులను తీసేసినట్టుగా మాట్లాడడం.. వారికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం.. వారిపై పెత్తనం రోజురోజుకూ ఎక్కువ అవుతుండడాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోలేకపోతుండడం గమనార్హం.

కార్యకర్తల్లో అంతర్మథనం..

టీఆర్ఎస్‌తో దోస్తీ కట్టడంపై మొదట్నుంచీ కమ్యూనిస్టు కార్యకర్తలు కాస్తంత అసహనంతో ఉంటూ వస్తున్నారు. నిజానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలు.. పార్టీ క్రమశిక్షణ డిఫరెంటు.. మద్యం.. డబ్బు పంచడం.. వ్యక్తిగత విమర్శలు.. అసత్య ప్రచారాలకు ఆ పార్టీ క్యాడర్ దూరంగా ఉంటుంది. కానీ మునుగోడు ఉపఎన్నిక విషయంలో వాటన్నింటినీ క్యాడర్ మోయాల్సి వస్తోంది. దీంతో ఇదేం ఖర్మరా బాబూ అంటూ లోలోపల తీవ్ర మనోవేదన చెందుతున్నారు. టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం కంటే.. ఒంటరిగా పోటీలో ఉండి.. ఓటు బ్యాంకును కాపాడుకున్నా బాగుండేదంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుంటే.. నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కమ్యూనిస్టు రాష్ట్ర నేతలను సైతం టీఆర్ఎస్ సమావేశాల్లో పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు.

శిలావిగ్రహాల్లాగా వేదికలపై నేతలు..

ఉపఎన్నిక ప్రచారంలో కమ్యూనిస్టు రాష్ట్ర నేతలు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. పేరుకు ఆ నేతలను వేదికపైకి పిలవడం మినహాయిస్తే.. వారు ప్రజలకు, క్యాడర్‌కు ఇచ్చే సందేశం ఆకట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పంచన చేరడం వల్ల.. ప్రజాసమస్యలపై నిలదీసే అవకాశం లేకుండాపోయింది. ఎంతసేపటికీ మతతత్వ పార్టీ బీజేపీ అంటూ మాట్లాడడమే మిగిలింది. దీంతో వారి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకోవడం లేదు. ఇదే సమయంలో TRS లీడర్లు.. కమ్యూనిస్టు నేతలకు మాట్లాడే అవకాశం అంతంతమాత్రంగానే ఇస్తున్నారు.

ఇటీవల రెడ్డిబావిగూడెంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో నిర్వహించిన ప్రచార సమావేశంలో ఇదేతంతు కన్పించింది. ఒకే వేదికపై మంత్రి మల్లారెడ్డి, CPM నేత చెరుపల్లి సీతారాములు ఇతర క్యాడర్ కూర్చుంది. సమావేశం కొనసాగుతుండగానే.. మల్లారెడ్డి వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. అప్పటి ఇంకా చెరుపల్లి సీతారాములు గానీ కమ్యూనిస్టు లీడర్లు గానీ మాట్లాడింది లేదు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ఎంపీటీసీ సైతం సీపీఎం పార్టీనే గెలిచింది. వాస్తవానికి ఆ గ్రామంలో CPM పార్టీ బలంగా ఉంది. ఓట్లు ఎవరికీ వేయాలనేది.. దాదాపుగా అక్కడ సీపీఎం పార్టీ డిసైడ్ చేస్తుంది. అలాంటి గ్రామంలోనూ CPM క్యాడర్‌పై అధికార పార్టీకి చెందిన ఓ మున్సిపల్ చైర్మన్ అనుచరులు బాసిజం చేస్తుండడాన్ని క్యాడర్ తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు క్యాడర్ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తుందా..? లేదా కమ్యూనిస్టులు అధికార టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ ఇస్తారా..? అన్నది వేచిచూడాల్సిందే.


Next Story