వరుస ఎన్‌కౌంటర్లు.. కమ్యూనిస్టు నేత సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-20 11:52:17  IST  )

వరుస ఎన్‌కౌంటర్లు.. కమ్యూనిస్టు నేత సంచలన వ్యాఖ్యలు

వరుస ఎన్‌కౌంటర్లు.. కమ్యూనిస్టు నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు(Maoists)లపై వరుస ఎన్‌కౌంటర్లు జరుపుతున్న వేళ సీపీఐ(ఎం) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీదా కేంద్రం దాడులకు దిగుతోందని అన్నారు. కేవలం మావోయిస్టుల మీదనే కాదని.. అన్ని రంగాల మీదా మోడీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. జైళ్లకు పంపుతున్నారని అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలను భయపడుతూ వస్తున్నారని తెలిపారు. ఆ ప్రభుత్వాలను కూల్చి ఏదో విధంగా అధికారంలోకి రావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాదు కూడదు అంటే.. ఐటీ, ఈడీ వంటి దాడులు జరుగుతున్నాయి.. బీజేపీ కండువా కప్పుకుంటే తప్పులన్నీ ఒప్పై పోతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.


వాళ్లకు నచ్చని మతం మీద బీజేపీ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. పేద, ఆదివాసీల హక్కుల కోసం మావోయిస్టులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. పీడిత ప్రజల కోసం పనిచేసే మావోయిస్టులను చంపేస్తున్నారని ఆవేదన చెందారు. హింసకు పాల్పడుతున్నారనే కారణంతో మావోయిస్టులను చంపేస్తున్నారు.. మరి గుజరాత్‌లో అల్లర్లకు అమిత్ షా, మోడీనే కారకులు.. వీరిద్దరిని ఎన్నిసార్లు ఎన్‌కౌంటర్ చేయాలని జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో వేరే పార్టీని అధికారంలోకి రానీయకుండా ఓట్ చోరీ చేస్తున్నారు.. దీనికి వీరిని ఎన్నిసార్లు ఎన్‌కౌంటర్ చేయాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీలంకలో చేసినట్టు ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.. బలమైన ఉద్యమంతో కేంద్రానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Next Story