Nitin Gadkari: ఆ పనికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-05-05 07:26:25  IST  )

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Nitin Gadkari: ఆ పనికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ అభివృద్ధిని, భవిష్యత్తును వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు నిర్దేశిస్తాయన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మహారాష్ట్ర బార్డర్‌లో రూ.3,526 కోట్లతో నిర్మించిన 95 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్ రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పనులు, కొత్త వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

‘అమృత్ సరోవర్‌’కు సహకరించాలి..

అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వలను పెంచుతున్నామని ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని గడ్కరీ కోరారు. రాష్ట్రంలో నీటి సరస్సులను గుర్తిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది అని పేర్కొన్నారు. ఈ జిల్లాకు ఎక్కువసార్లు రావడానికి తాను ఇష్టపడతానన్నారు. పలు జిల్లాల్లో జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినట్టు చెప్పారు.

సాగులో సాంకేతికతను వినియోగించుకోవాలి..

కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఈవీ, సీఎన్జీ వాహనాలు ఇంకా పెరగాలని గడ్కరీ అన్నారు. వ్యవసాయంలో కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో నీళ్ల కొరత లేదని, సద్వినియోగం చేసుకోవడంలోనే విఫలం అవుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కేంద్రం కీలక ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Next Story