- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాధుల నియంత్రణలో ఎంఎస్‌యూ సిబ్బందే కీలకపాత్ర : కమిషనర్ కర్ణన్
నగర ప్రాంతాల్లో ప్రజారోగ్య భద్రతను మరింత పటిష్టం చేయడానికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎంఎస్‌యూ) సిబ్బందికి మూడు రోజుల సంయుక్త ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్‌లోని డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రారంభమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగర ప్రాంతాల్లో ప్రజారోగ్య భద్రతను మరింత పటిష్టం చేయడానికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎంఎస్‌యూ) సిబ్బందికి మూడు రోజుల సంయుక్త ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్‌లోని డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, థానే నగరాలకు చెందిన ఎంఎస్‌యూ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ.కర్ణన్ మాట్లాడుతూ, నగరాల్లో వ్యాధుల నివారణ, నియంత్రణలో ఎంఎస్‌యూ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వ్యాధుల వ్యాప్తిపై సత్వర సమాచారం సేకరణ, ధృవీకరణతో పాటు తక్షణ చర్యలు చేపట్టడం వారి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నీటి ద్వారా వ్యాపించే ఆక్యుట్ డయేరియా, కలరా, వైరల్ హెపటైటిస్ వంటి వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. ఫుడ్ పాయిజనింగ్, జూనోటిక్ వ్యాధుల నియంత్రణలో ‘వన్ హెల్త్’ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యాధుల పర్యవేక్షణకు కేంద్రంగా హైదరాబాద్
మురికివాడలు, అధిక జనసాంద్రత ప్రాంతాలు, వలస కార్మికులు నివసించే ప్రాంతాల్లో వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-ఏబీహెచ్‌ఐఎం) కింద ఏర్పాటు చేసిన ఎంఎస్‌యూ హైదరాబాద్ నగర వ్యాధుల పర్యవేక్షణకు కేంద్రంగా పనిచేస్తోందని తెలిపారు. 17 పోస్టులకుగాను ఇప్పటికే 14 మందిని నియమించగా, మిగిలిన ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా నియమితులైన సిబ్బందికి శాఖాపరమైన శిక్షణ కొనసాగుతోందన్నారు. నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ప్రయోగశాల సేవలు అందుబాటులో ఉన్నాయని, బయో సేఫ్టీ లెవల్-2 పరికరాల కొనుగోలు ద్వారా మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వ్యాధుల పర్యవేక్షణ, స్పందన చర్యలు వేగవంతం అవుతాయని వివరించారు. హైదరాబాద్‌లో డెంగ్యూ కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెక్టర్ బోర్న్ డిసీజ్ యాప్ ద్వారా రియల్ టైమ్‌లో కేసుల గుర్తింపు, జీఐఎస్ మ్యాపింగ్, ఫీల్డ్ స్థాయిలో చర్యలు సమర్థంగా అమలవుతున్నాయని తెలిపారు.
మూడు రోజుల శిక్షణ…
మూడు రోజుల శిక్షణలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ (ఐహెచ్‌ఐపీ)పై ప్రత్యక్ష శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎపిడెమియాలజీ పరిశోధనలు, వ్యాధి ప్రబలత కేస్ స్టడీస్, డేటా భద్రత, రిస్క్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ అవగాహన, ప్రజారోగ్య చట్టపరమైన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ ఒకే శాఖ బాధ్యత కాకుండా ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్య, పశుసంవర్ధక, పర్యావరణ శాఖల సమిష్టి కృషితో సాధ్యమవుతుందని కమిషనర్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పరస్పర సమన్వయం పెంపొందించుకోవాలని సూచించారు. తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , ప్రధాన శాఖల ఉన్నత అధికారులు, సీనియర్ అధికారులు పాల్గొని, పట్టణ ప్రజల ఆరోగ్య రక్షణలో బలమైన పర్యవేక్షణ , తక్షణ వైద్య సేవలు అందించడంలో నిర్వహించవలసిన వ్యవస్థల ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌లు హేమంత కేశవ్ పాటిల్, రఘు ప్రసాద్, జోనల్ కమిషనర్ ప్రియాంక అల, జాయింట్ డైరెక్టర్ డా. శుభాంగి కుల్సంగే, డా. ప్రదీప్ అవాటే (ఎంఎస్‌యూ), రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ (హెల్త్) డా. పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ వకీల్, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.






