Deputy CM Bhatti : అంబేద్కర్ పై వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే : డిప్యూటీ సీఎం భట్టి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-24 09:23:22  IST  )

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్(Ambedkar) ను అవమానించేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)వ్యాఖ్యానించడం రాజ్యాంగాన్ని (Constitution)అవమానించడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విమర్శించారు

Deputy CM Bhatti : అంబేద్కర్ పై వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే : డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్ డెస్క్ : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్(Ambedkar) ను అవమానించేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)వ్యాఖ్యానించడం రాజ్యాంగాన్ని (Constitution)అవమానించడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విమర్శించారు.అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao)తో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు రాజ్యాంగపరంగా ఏర్పాటైన భారత పార్లమెంటులోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వెంటనే బర్తరఫ్ చేయాలని, అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు.

అంబేద్కర్ పట్ల, రాజ్యాంగం పట్ల బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకత వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. దేశ ప్రజలందరికి సమాన అవకాశాలు, హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని , రాజ్యాంగ నిర్మాతను విమర్శించడాన్ని ప్రజలంతా ఖండించాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ సంవిధాన్ సమ్మేళన్ పిలుపుతో భారత రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేశారని, ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ దేశ ఐక్యతను, భారత రాజ్యాంగాన్ని దెబ్బతీసేలా అంబేద్కర్ పై అనుచిత వ్యా్ఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, ప్రధాని మోడీ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story