- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాంపస్‌లో డ్రగ్స్ కనిపిస్తే కాలేజీ గుర్తింపు రద్దు: డీజీపీ సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్
విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మాటే వినపడకుండా చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నట్లుగా డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) స్పష్టం చేశారు. ఒకవేళ ఏ విద్యాసంస్థలోనైనా డ్రగ్స్ విక్రయాలు, వినియోగం జరిగినట్లుగా తేలితే, సదరు సంస్థల గుర్తింపును రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఇవాళ డీజీపీ సీవీ ఆనంద్ ఈగల్ (EAGLE) విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో డీజీపీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతి క్యాంపస్‌లో ప్రత్యేక నిఘా కమిటీలు..
అయితే, ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల రక్షణను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి విద్యాసంస్థలో ఓ స్పెషల్ కో-ఆర్డినేటర్‌ను నియమించడం తప్పనిసరి అని తెలిపారు. విద్యార్థులు కాలేజీల్లో చేరే సమయంలోనే డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించాలని.. ఇందుకోసం సైకాలజిస్టులు, నిపుణుల సేవలను వినయోగించుకోవాలని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఉమ్మడి కార్యాచరణకు ఆదేశం..
ఈగల్ అధికారులు రూపొందించిన ముసాయిదా ప్రజెంటేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్ విధివిధానాల్లో కొన్ని మార్పులను సూచించారు. పోలీస్, విద్యా, ఆరోగ్య శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలను (NGOs) భాగస్వామ్యం చేస్తూ సమగ్రమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) తయారు చేయాలని ఆదేశించారు. త్వరలోనే దీనిపై మరో సమావేశం నిర్వహించి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దే విద్యా సంస్థల్లో డ్రగ్స్‌కు ఏమాత్రం చోటు లేదని, ప్రతి విద్యార్థికి సురక్షితమైన, డ్రగ్స్ రహిత వాతావరణాన్ని అందించడమే మా ప్రాధాన్యత అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ‘ఈగల్’ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజీ పద్మజా రెడ్డి, ఎస్పీ గిరిధర్ సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






