- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: సీఎం చెప్పినా మారని కలెక్టర్లు.. అమానవీయంగా వ్యవహరిస్తున్నారని చర్చ!
రాష్ట్రంలోని భూ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి.. పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని భూ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి.. పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే, కలెక్టర్ల పనితీరు చూస్తుంటే మాత్రం దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. మానవతా దృక్పథం ఏమో గానీ.. అమానవీయంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా కలెక్టర్లకు భూ చట్టాలపై సరైన అవగాహన లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాల్లో పెండింగ్, పలుమార్లు తిరస్కరణకు గురైన ఫైళ్ల సంఖ్యనే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. రెవెన్యూ శాఖలో కలెక్టర్లను ‘ధరణికి ముందు.. ఆ తర్వాత’ అని కేటగిరీలుగా పిలుస్తున్నారు. ధరణి రాకంటే ముందు రెవెన్యూ శాఖలో సబ్ కలెక్టర్, అదనపు కలెక్టర్, కలెక్టర్లుగా పని చేసిన వారికి అవగాహన కాస్త మెరుగ్గా ఉండగా.. ఆ తర్వాత కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన వారిలో చాలా మందికి సరైన అవగాహన లేదని, దీంతోనే వారు ఫైళ్లు పెండింగ్ పెడుతున్నారని అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
కలెక్టర్లలో కానరాని మార్పు..
రాష్ట్రంలో ఆరేండ్లలో రెండు ఆర్వోఆర్ చట్టాలు వచ్చాయి. ధరణికి గైడ్ లైన్స్ జారీ చేయక, ఓరియెంటేషన్ ఇవ్వకపోవడంతో కలెక్టర్లు, ఇతర అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనేక సమస్యలకు సొంత భాష్యంతో ఎన్వోసీలు జారీ చేశారు. రూ.వేల కోట్ల భూములను ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులకు కట్టబెట్టారు. భూ భారతి చట్టం, రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారులకు ఎలాంటి అవగాహనా సదస్సులు పెట్టలేదు. భూ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నా.. కలెక్టర్లల్లో మార్పు కనిపించడం లేదు. ఒక్కో ఫైల్‌ను నాలుగైదు సార్లు రిజెక్ట్ చేస్తున్నారు. భూ సమస్యలను ఎలా పరిష్కరించాలి? ఏ చట్టం, సెక్షన్ ప్రకారం చేయాలి? అనే వివరాలపై ఉన్నతాధికారులకే సరైన అవగాహన కనిపించడం లేదు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి, ఎక్కడ తప్పుదొర్లిందో చూసి.. సవరించడం ద్వారా పరిష్కారమయ్యే వాటికి కూడా ఏండ్ల తరబడి దరఖాస్తుదారులను కార్యాలయాలకు తిప్పించుకుంటున్నారు. తహశీల్దార్లు, ఆర్డీవోలు సబ్మిట్ చేసిన రిపోర్టులను కూడా కలెక్టర్లు విశ్వసించక రిజెక్ట్ చేస్తున్నారు. తాము రికార్డులు వెరిఫై చేసి రిపోర్టు పంపినా.. కొందరు కలెక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారని తహశీల్దార్లు, ఆర్డీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే తమకు బాధితుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయంటున్నారు.
గైడ్ లైన్స్ తక్షణ అవసరం
ఐదారు దశాబ్దాల నుంచి రికార్డుల్లో పట్టాగా ఉన్న భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. పరిష్కరించాలని దరఖాస్తు చేసుకుంటే.. ఖాస్రా పహానీ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. మరి అప్పటివరకు పట్టాగా రాయడం వల్లనే తాము కొనుగోలు చేశామన్న బాధితుల ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఆర్వోఆర్-1971 ప్రకారం నేచర్ ఆఫ్ ల్యాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ.. కొందరు కలెక్టర్లు మాత్రం ఖాస్రా పహానీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరికొన్ని జిల్లాల్లో 20, 30 ఏండ్ల నుంచి పట్టా ఉంటే పీవోబీ నుంచి తొలగిస్తున్నారు. కొందరు కలెక్టర్లు మాత్రం తమకు సీసీఎల్ఏ నుంచి ఆదేశాలే ప్రామాణికం అంటూ భీష్మించుకొని కూర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పీవోబీ, నేచర్ ఆఫ్ ల్యాండ్, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ వంటి సమస్యలకు సరైన నిబంధనలను రూపొందించాల్సిన తక్షణ అవసరం ఉంది.
అనేక ఉదాహరణలు
- ఓ జిల్లాలో వృద్ధురాలికి 6.26 ఎకరాల భూమి ఉన్నది. ఆమెకు కూతుర్లు మాత్రమే ఉండగా.. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు కూతుర్లకు భూమి రాసిద్దామని ఆ వృద్ధురాలు ప్రయత్నిస్తే.. అది అసైన్డ్ భూమి అని రికార్డుల్లో కనిపించింది. సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకొని.. ఏడాదిన్నరగా కార్యాలయాల చుట్టూ ఆమె తిరుగుతున్నది. ఆ సర్వే నంబరులో 19.37 ఎకరాలు ఉంది. అది ఖాస్రా పహానీ (1954–55) నుంచి పట్టాగానే ఉన్నది. చెస్తాలాలోనూ పట్టానే. ఆ తర్వాత 1993–94 లో పట్వారీ దాన్ని ఏ కారణం లేకుండా మొత్తాన్ని లావునీ పట్టాగా మార్చేశారు. రిమార్క్ కాలమ్ లో ఎలాంటి వివరాలు రాయలేదు. పట్టాదారుల పేర్లనే అసైన్డ్ పట్టాదారులుగా మార్చారు. భూ భారతిలో కొందరి పేర్లు పట్టా, మరికొందరివి లావునీ పట్టాగా మార్చేశారు. రికార్డులన్నీ వెరిఫై చేసి తహశీల్దార్ అది పట్టా అని రాశారు. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు కూడా రికమండ్ చేశారు. ఈ ఫైల్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఇరవై ఏండ్లు ఏం చేశారు? అప్పటినుంచి ఎందుకు మార్చుకోలేదంటూ తహశీల్దార్ కి ఫైల్‌ను తిప్పి పంపారు. దీంతో పేదలకు న్యాయం చేయాల్సిన కలెక్టర్లు అమానవీయంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
– రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నం.41/20ఆ1/2లో అల్మాస్ గూడకు చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి 15 గుంటల భూమిని 2019లో స్టాంపు డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ చేయించుకున్నారు. కొనుగోలుకు ముందే 1954 నుంచి పహానీలను పరిశీలిస్తే ఆ సర్వే నంబరులోని భూమి పట్టాగానే ఉన్నది. ధరణి రికార్డుల్లోకి కూడా ఎక్కింది. కానీ ఆ తర్వాత అది ఖాస్రాలో ఉందంటూ పీవోబీలో నమోదు చేశారు. మూడు సార్లు అప్లయ్ చేస్తే తహశీల్దార్ ఉన్నది ఉన్నట్లుగా రాసి రిపోర్ట్ పంపిస్తే అదనపు కలెక్టర్, కలెక్టర్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే 70 ఏండ్ల పహానీల్లో పట్టాగా ఉందని కొనుగోలు చేస్తే ఇప్పుడు తమను శిక్షిస్తారా? అని బాధితుడు వాపోతున్నాడు.
– కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం యరడపల్లిలో సర్వే నం.200/2లో 0.38 ఎకరాలను ఖారీజ్ ఖాతాగా నమోదు చేశారు. కానీ తరతరాలుగా అది పట్టాగానే ఉందని పహానీలు స్పష్టం చేస్తున్నాయి. ఇది పట్టాగా మార్చాలంటూ అప్లై చేస్తే శంకరపట్నం తహశీల్దార్ మూడు సార్లు రిజెక్ట్ చేశారు. ఆఖరికి సీసీఎల్ఏ అధికారుల నుంచి ఫోన్ చేయించి ఖారీజ్ ఖాతా అంటే ప్రభుత్వ భూమి కాదని స్పష్టత ఇప్పించినా నెగెటివ్ రిపోర్టు రాశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సేత్వార్, ఖాస్రా పహానీ ప్రామాణికంగా పీవోబీ జాబితాను రూపొందించడం వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు.
- ఇద్దరు రైతుల మధ్య భూ వివాదం. ఓ రైతు తాను కేసు వేశానంటే పీవోబీలో నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఒరిజినల్ రైతుకు అనుకూలంగా ఇచ్చింది. ఆ కాపీని సబ్ మిట్ చేసి పీవోబీ నుంచి తొలగించాలని దరఖాస్తు చేశాడు. ఈ విషయంపై ప్రభుత్వానికి రాశానంటూ ఏడాదిగా కోర్టు తీర్పును అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిందో చూసి పరిష్కరించాల్సి ఉండగా.. కలెక్టర్ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అప్పీల్ వ్యవస్థ రాకముందే..
రికార్డుల పరిశీలనతోనే పరిష్కారమయ్యే చిన్న సమస్యలను కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బద్నాం అవుతున్నది. కొందరు కలెక్టర్లు ఫైళ్లను రిజెక్ట్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలంటూ మౌఖికంగా సూచిస్తున్నారు. ఇప్పటికీ అప్పీల్ వ్యవస్థ ఏర్పడలేదు. కానీ ఆ మాట చెప్తూ అధికారులు అభాసుపాలవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బాధితుల ఆక్రోశం బయటపడుతుందనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమాల్లో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడుతున్న ఘటనల వెనక కలెక్టర్ల నిర్లక్ష్యం, అవగాహన లేమి ప్రధాన కారణమని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. ఇకనైనా భూ భారతి చట్టం రూల్స్, మిగతా పీవోబీ, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ వంటి సమస్యలకు పరిష్కారం వంటి వాటిపై అధికారులకు వెంటనే ఓరియెంటేషన్ ఇవ్వాల్సిన అవసరమున్నది.






