సంస్థ మనుగడ కోసం సహకరించండి.. 39వ నిర్మాణాత్మక సమావేశంలో సింగరేణి సీఎండీ

by Ramesh Naini |

అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతున్న సింగరేణికి సుస్థిర భవిష్యత్ అందించడానికి ప్రతి ఉద్యోగి భాగస్వామిగా ఉండాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం కోరారు.

సంస్థ మనుగడ కోసం సహకరించండి.. 39వ నిర్మాణాత్మక సమావేశంలో సింగరేణి సీఎండీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతున్న సింగరేణికి సుస్థిర భవిష్యత్ అందించడానికి ప్రతి ఉద్యోగి భాగస్వామిగా ఉండాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం కోరారు. పని సంస్కృతిని మెరుగుపరుస్తూ ఉద్యోగులు తమకు కేటాయించిన షిఫ్టులో 8 గంటల పూర్తి సమయాన్ని సంస్థ కోసం పనిచేసేందుకు గుర్తింపు కార్మిక సంఘం సహకారం అందించాలని ఆయన కోరారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తో జరిగిన 39వ నిర్మాణాత్మక సమావేశంలో సీఎండీ మాట్లాడారు. బొగ్గు రంగంలో పోటీని తట్టుకునేందుకు బొగ్గు ధరలను తగ్గించామని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం అనివార్యమని, అప్పుడే సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగించడానికి, ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే ఉద్యోగులు పూర్తి పని గంటలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తిగా వినియోగించాలన్నారు. విధులకు గైర్హాజరు అవుతున్న కార్మికులు విధులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని, తద్వారా క్రమశిక్షణను పెంచడం సాధ్యమవుతుందన్నారు.

సింగరేణి భవిష్యత్తులో 10 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగుతుందన్నారు. బొగ్గు రంగానికే పరిమితమైన సంస్థను 5 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేసేలా తీర్చిదిద్దేందుకు వీలుగా సింగరేణి గ్రీన్ ఎనర్జీ, విశ్వవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సింగరేణిలో ఉన్న 40 వేల మంది ఉద్యోగులు, సంస్థపై ఆధారపడిన 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్ దృష్ట్యా కొత్త బొగ్గు గనులను వేలంలో దక్కించుకోవడానికి కృషి చేస్తున్నామని, తద్వారా సింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్తు ఉంటుందన్నారు.

300 కోట్ల వ్యయంతో వెయ్యి క్వార్టర్స్ నిర్మాణం..

సింగరేణి ఉద్యోగులకు దేశంలోనే ఏ కంపెనీలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, వీటిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎండీ తెలిపారు. ఉద్యోగులకు విశాలమైన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం రూ.300 కోట్లకు పైగా వెచ్చించి గోదావరిఖని, శ్రీరాంపూర్, మణుగూరు, కొత్తగూడెం, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో వెయ్యి క్వార్టర్స్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి గోదావరిఖనిలో వచ్చే రెండు నెలల్లో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఉద్యోగుల పిల్లలకు జాతీయ స్థాయి విద్యా బోధనను అందించేందుకు ఇప్పటికే రామగుండం-2 ఏరియాలో సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభించామని, ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కొత్తగూడెంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి..

సింగరేణి భవిష్యత్తు కోసం సంపూర్ణంగా సహకరిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడడానికి తమ యూనియన్ తరపున ఎన్నో త్యాగాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని రూపొందించాలని, కొత్తగూడెంలో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విశ్రాంత కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. కొత్తగూడెం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అక్కడ సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి పుట్టినిల్లు అయిన ఇల్లందు భవిష్యత్ కోసం కొత్త ప్రాజెక్టును త్వరగా ప్రారంభించవలసిందిగా కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కోసం ఈఎస్ఐ సేవలు అందించేందుకు యాజమాన్యం తీసుకున్న చొరవను అభినందించారు. కొత్తగూడెం బస్టాండ్ ఆధునికీకరణ కోసం సామాజిక బాధ్యత నిధులను కేటాయించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. గుర్తింపు కార్మిక సంఘం ద్వారా వివరించిన సమస్యలపై నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని, ఆర్థిక పరమైన సమస్యలపై కమిటీలు వేసి చర్యలు తీసుకుంటామని సీఎండీ పేర్కొన్నారు. కార్యక్రమానికి డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు శ్రీ ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పి అండ్ పి), ఎం.తిరుమల రావు (ఈ అండ్ ఎం), జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, జీఎం(పర్సనల్) ఐఆర్, పీఎం కవితా నాయుడు, ఇతర జీఎంలు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ తో పాటు వివిధ ఏరియాల నుంచి హాజరైన గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు వివిధ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

Next Story