ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల మధ్య కోల్డ్ వార్.. సీఎంకు చేరిన పంచాయితీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-27 00:31:26  IST  )

ఈ మధ్య జరిగిన ఐఏఎస్ ల బదిలీలతో స్పెషల్ సీఎస్ హోదాలోని ఇద్దరు ఐఏఎస్ లు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్ మధ్య కొనసాగుతున్న

ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల మధ్య కోల్డ్ వార్.. సీఎంకు చేరిన పంచాయితీ
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఈ మధ్య జరిగిన ఐఏఎస్ ల బదిలీలతో స్పెషల్ సీఎస్ హోదాలోని ఇద్దరు ఐఏఎస్ లు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ కు తెరపడింది అనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఆ ఇద్దరు ఐఏఎస్ లు ఇంతకాలం ఒకే శాఖ బాధ్యతలు చూస్తుండడంతో ఒకరంటే మరొకరికి పొసగని పరిస్థితులు ఉండేవనే టాక్ ఉండేది. తనే సుపీరియర్ అని ఒకరు, బిజినెస్ రూల్స్ ప్రకారం తానే అసలైన బాసు అని మరొకరు ఫీలయ్యేవారు. కానీ ఇప్పుడు జయేశ్ ను ఆ శాఖ నుంచి బదిలీ (హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్) చేయడంతో సంజయ్ ఊపిరి పీల్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

సీఎంకు చేరిన పంచాయితీ

బీఆర్ఎస్ హయాం నుంచి ఐటీ, ఇండస్ట్రీ శాఖ బాధ్యతలు చూసిన జయేశ్ రంజన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే శాఖలో పనిచేశారు. దీంతో ఆయనకు ఎందుకు అంత ప్రాధాన్యత? ఎంతకాలం ఆయన్ను అదే శాఖలో కొనసాగిస్తారు? అనే విమర్శలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ చివరన జయేశ్ ను బదిలీ చేసి, ఆ శాఖ బాధ్యతలు సంజయ్ కుమార్ కు అప్పగించారు. కానీ జయేశ్ ను సీఎంఓలోకి తీసుకుని, ఇండస్ట్రీయల్ అండ్ ఇన్వెస్టిమెంట్ సెల్ కు సీఈఓగా నియమించారు. దీంతో ఆయన మళ్లీ పాత శాఖలోని వ్యవహారాల్లో జోక్యం చేయడం ప్రారంభించారు. ఆ శాఖకు చెందిన ఆఫీసర్లతో మాట్లాడడం, అధికారిక ఈ మెయిల్ పాస్ వర్డ్ సంజయ్ కు ఇవ్వలేదు. దీంతో దేశ, విదేశాలకు చెందిన కార్పొరేటు కంపెనీల నుంచి వచ్చే సమాచారం ఆయనకు తెలిసేది కాదు. బిజినెస్ రూల్స్ ప్రకారం శాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ శాఖకు బాస్. విధానపరమైన నిర్ణయాల్లో ఆయన సంతకం తప్పనిసరి. కానీ సొంత శాఖలో జరుగుతున్న డెవలప్ మెంట్స్ తనకు తెలియకపోవడంపై అవేదన చెందిన సంజయ్ పలుసార్లు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. కానీ జయేశ్ వ్యవహర శైలిలో మార్పురాకపోవడంతో ఈ పంచాయితీ చివరికి సీఎం రేవంత్ రెడ్డికి చేరినట్లు తెలిసింది.

నేనే అసలైన బాసును

సీఎంఓలో స్పెషల్ సీఎస్ హోదాలో ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ సీఈఓగా పనిచేసిన కాలంలో ఐటీ, ఇండస్ట్రీ శాఖకు చెందిన అన్ని వ్యవహారాలను అయనే పర్యవేక్షించేవారు. పాత బాస్, కొత్త హోదాలో ఉండటంతో కింది స్థాయి అధికారులు, పలు ప్రైవేటు, కార్పొరేటు కంపెనీల ప్రతినిధులు సైతం జయేశ్ ఆదేశాలను పాటించేవారు. దీంతో ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖలో ఆయన హవా కొనసాగింది. అయితే సంజయ్ వ్యక్తం చేసే అభ్యంతరాలను ఆయన సీరియస్ గా తీసుకోలేదు. సర్వీసులో జయేశ్ (1992 బ్యాచ్) సంజయ్ కుమార్ (1995 బ్యాచ్) కంటే సీనియర్. దీనికి తోడు సీఎంఓలో అదే శాఖకు చెందిన వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తుండటంతో తనే బాసు అనే తీరుగా ఆయన వ్యవహరించేవారు.

మంత్రి శ్రీధర్ బాబు సైతం అసహనం

ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు సందర్భాల్లో జయేశ్ రంజన్ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. మంత్రికి సమాచారం ఇవ్వకుండానే ఆ శాఖలోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారని విమర్శలు ఉండేవి. ఇలా పలుసార్లు జరగడంతో మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు సంజయ్ ఆ శాఖలో తన సమర్థతను చూపించుకోవాలి. లేకపోతే ఆయనను అక్కడి నుంచి ఇతర శాఖకు బదిలీ చేస్తారనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో ఉంది.

Next Story