పైసలిస్తలేరు పనిచేస్తలేం..కొత్త టెండర్ కోసం ప్రభుత్వానికి సీడీఎంఏ లేఖ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-08 18:02:28  IST  )

పురపాలకశాఖ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన

పైసలిస్తలేరు పనిచేస్తలేం..కొత్త టెండర్ కోసం ప్రభుత్వానికి సీడీఎంఏ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పురపాలకశాఖ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో సీడీఎంఏ 2019 ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రంలోని 73మున్సిపాలిటీల్లో ముగిసింది. మరో 67మున్సిపాలిటీల్లో 2027 వరకు గడువు ఉంది. అయితే కాంట్రాక్టు ఎజెన్సీకి పాత బకాయిలు చెల్లించకపోవడంతో వీధిదీపాల నిర్వహణను సదరు ఎజెన్సీ గాలికొదిలేసిందని పలు మున్సిపాలిటీల్లో మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చెబుతున్నారు. మరో పక్క కాంట్రాక్టు ఎజెన్సీ పనిచేయకపోవడంతోనే తాము బిల్లులు చెల్లించలేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పైసలిస్తలేరని ఈఈఎస్ఎల్..పనిచేయకపోవడంతోనే ఇవ్వడంలేదని మున్సిపల్ అధికారులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

9.78లక్షల లైట్లు…

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలను కలిపితే ఈ సంఖ్య 160కి చేరింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ లను కలిపి 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కొత్తగా ఏర్పడిన 20 మున్సిపాలిటీలను మినహాయిస్తే 140 మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణను బాధ్యతలను ఈఈఎస్ఎల్ కే అప్పగించిన విషయం తెలిసిందే. వీటిలో 9.78లక్షల స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. ఒక్క వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 1.5లక్షలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

రూ.200కోట్ల బకాయిలు…

రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్లకు సంబంధించి కాంట్రాక్టు ఎజెన్సీ అయిన ఈఈఎస్ఎల్ కు రూ.200కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పురపాలకశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఓఆర్ఆర్ పరిధిలోని 7మున్సిపల్ కార్పొరేషన్లు, 20మున్సిపాలిటీల్లోనే సుమారు 2.40లక్షల స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. అత్యధిక బకాయిలు సైతం వీటిల్లోనే ఉన్నాయని సమాచారం. ఈ బకాయిలు చెల్లించాలని ఈఈఎస్ఎల్ ప్రతినిధులు పలుమార్లు పురపాలకశాఖకు మొరపెట్టుకున్న ఫలితంలేకుండ పోయిందని తెలిసింది. దీంతోపాటు ఈఈఎస్ఎల్ కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ నుంచి ఆదేశాలు జారీచేసినా ఫట్టించుకోవడంలేదనే విమర్శలూలేకపోలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే బకాయిలు చెల్లించడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. మరో రూ.30కోట్లు బిల్స్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

కొత్త టెండర్ కోసం ప్రభుత్వానికి లేఖ…

పురపాలకశాఖ పరిధిలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ గడువు ముగియడంతో కొత్త టెండర్లకు వెళ్లాలా? మళ్లీ ఈఈఎస్ఎల్ సంస్థకే ఇవ్వాలా? అనే విషయంపై క్లారిటీ కోసం ప్రభుత్వానికి సీడీఎంఏ అధికారులు లేఖ రాశారు. సాధారణంగా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయినా ఈఈఎస్ఎల్ టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి సిద్దంగాలేదు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాంట్రాక్టు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మరో 67 మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణ గడువు 2027 వరకు ఉన్నది. దీంతో మరో 73మున్సిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పడిన 20 మున్సిపాలిటీలకు సంబంధించిన టెండర్లను ఈఈఎస్ఎల్ సంస్థకే అప్పగించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి క్లారిటీ రాగానే ప్రాసెస్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story