- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఫిర్యాదుకూ ట్రాకింగ్ ఐడీ.. ప్రజావాణిలో పారదర్శకతకు సీఎంసీ శ్రీకారం
ప్రతి ఫిర్యాదుకు పారదర్శకత, పర్యవేక్షణ, తదుపరి చర్యల కోసం ఒక ప్రత్యేక 'ట్రాకింగ్ ఐడి' కేటాయించామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఫిర్యాదుకు పారదర్శకత, పర్యవేక్షణ, తదుపరి చర్యల కోసం ఒక ప్రత్యేక 'ట్రాకింగ్ ఐడి' కేటాయించామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన తెలిపారు. సీఎంసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి పౌరుల నుంచి విశేష స్పందన లభించింది. పౌరులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, మొత్తం 82 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎక్కువగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే 55 ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కమిషనర్ సృజన ఆదేశించారు. అందిన ఫిర్యాదులన్నిటినీ ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిరంతరం ఫాలో-అప్ చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల స్థితిగతులు, నివేదికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రతి సమస్య క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పరిష్కారమయ్యేలా చూస్తామని కమిషనర్ తెలిపారు.
ఎంఎంసీలో 24 ఫిర్యాదులు..
ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, వినతులను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు కూడా పాల్గొని సమస్యలను పరిశీలించారు. 24 వినతిపత్రాలు అందగా, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి తక్షణ పరిష్కారం కోసం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని, వాటి పరిష్కారం వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఇంజినీరింగ్ విభాగం 8, టౌన్ ప్లానింగ్ విభాగం 13, రెవెన్యూ విభాగం 3 ఉన్నాయి.
జీహెచ్ఎంసీలో 59 ఫిర్యాదులు..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 59 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హెడ్ ఆఫీస్‌లో 41 ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.






