అమిత్ షాతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. మావోయిస్టు అగ్రనేతల ప్రతిపాదనలపై చర్చ

by Kema Shiva Kumar |

ఢిల్లీలో అమిత్ షా‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. మావోయిస్టుల లొంగుబాటు, ఆపరేషన్ కగార్, ఈగల్ టీమ్ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు.

అమిత్ షాతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. మావోయిస్టు అగ్రనేతల ప్రతిపాదనలపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, అడిషనల్ డీజీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేసేందుకు కేంద్రం నిర్దేశించుకున్న ‘మావోయిస్టు రహిత భారత్’ లక్ష్యంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి, హోంమంత్రి అమిత్ షాకు నివేదికను అందజేశారు.

ఈగల్ టీమ్‌ను బలోపేతం చేయండి.. అమిత్ షా

అదేవిధంగా ఇటీవలే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహరెడ్డి ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అపరేషన్ కగార్‌కు తెలంగాణ పోలీసులు సహరించారని అమిత్ షా అన్నట్లుగా సమాచారం. ఆపరేషన్ పూర్తి అయ్యేంత వరకు ఇలాగే సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని.. తెలంగాణలో ఈగల్ టీమ్‌ను బలోపేతం చేయాలని అమిత్ షా, సీఎం రేవంత్‌కు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఇక ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి, అమిత్ షాకు వివరించారు. తెలంగాణకు ఐపీఎస్ కేడర్ సంఖ్యను పెంచాలని కోరినట్లుగా సమాచారం అందుతోంది.

Next Story