‘జనజీవన స్రవంతిలోకి రండి’.. మావోయిస్టు అగ్రనేత గణపతికి CM రేవంత్ పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-07 11:30:45  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దాదాపు 130 మంది మావోయిస్టులు తుపాకులతో సహా లొంగిపోయారు.

‘జనజీవన స్రవంతిలోకి రండి’.. మావోయిస్టు అగ్రనేత గణపతికి CM రేవంత్ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో దాదాపు 130 మంది మావోయిస్టులు తుపాకులతో సహా లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తాము ఇచ్చిన పిలుపును గౌరవించి లొంగిపోయిన మావోయిస్టులు అందరికీ స్వాగతం, ధన్యవాదాలు చెప్పారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వీరి భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని హామీ ఇచ్చారు. ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. శాంతి మార్గంలోనే మహాత్మ గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని గుర్తుచేశారు.

గణపతికి పిలుపు..

‘ఇటీవల లొంగిపోయిన కీలక నేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి సహా ఇద్దరు ముగ్గురు కీలక నేతలతో సమావేశం అయ్యాను. వారితో సుధీర్ఘంగా చర్చించాను. వారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చాను. రాష్ట్ర పరిధిలోనే వారి డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. ఇదే అంశంపై ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో కూడా మాట్లాడాను. ఆయుధాలతో లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించాలని అమిత్ షా చెప్పారు. లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టులకు నమ్మకం కల్పిస్తున్నాం. వారి ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తాం. ఈ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుకు కృషి చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు. అగ్రనేత గణపతి సహా మిగిలిన ఏడుగురు కూడా లొంగిపోవాలి. వారి భద్రతకు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరోసా ఇస్తుంది. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడా లొంగిపోలేదు. మాపై నమ్మకం పెట్టుకున్న అందరినీ కాపాడుకునే బాధ్యత మాదే. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేకమైన ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తాం. నగదును కూడా పెంచేందుకు ప్రయత్నం చేస్తాం’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ముగిసిన మావోయిస్టుల శకం.. ఇవాళ సీఎం ఎదుట అగ్రనేత గణపతి సరెండర్!

Next Story