‘ఉన్నది మూడు అడుగులే.. కానీ ఎగిరెగిరి పడుతుండు’: మాజీ మంత్రిపై CM రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

‘ఉన్నది మూడు అడుగులే.. కానీ ఎగిరెగిరి పడుతుండు’: మాజీ మంత్రిపై CM రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తిరుమలగిరిలో సోమవారం అట్టహాసంగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని అన్నారు. ఎందరో పోరాట యోధులను నల్లగొండ అందించిందని కొనియాడారు. ఈ గడ్డమీద నుంచి కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కొత్త రేషన్ కార్డులతో 11.3 లక్షల మంది లబ్ధి జరుగనుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్‌(BRS) హయాంలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్న తమను అభినందించకపోగా కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లే సాగునీరు వస్తోందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు వచ్చిందా? అని ప్రశ్నించారు. తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా ఇచ్చామని గుర్తుచేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది మంది పేదలు సన్నబియ్యం తింటుంటే.. బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని సీరియస్ అయ్యారు. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తుంటే చూడలేకపోతున్నారని అన్నారు. మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు ఇలా అందరి కష్టాలు తీరుస్తూ.. సుపరిపాలన అందిస్తున్నామని వెల్లడించారు. మరో రెండు సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగులను ఆదుకునే బాధ్యత నాది అని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కళ్లు ఉండి కూడా చూడలేని.. మూడు అడుగుల స్థానిక లీడర్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story