భూసేకరణ విషయంలో సీఎం రేవంత్​నిర్ణయం హర్షణీయం : రైతు కమిషన్ బృందం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పరిశ్రమలు, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే భూసేకరణ విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం హర్షణీయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు.

భూసేకరణ విషయంలో సీఎం రేవంత్​నిర్ణయం హర్షణీయం : రైతు కమిషన్ బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పరిశ్రమలు, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే భూసేకరణ విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం హర్షణీయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. భూములు ఇచ్చే రైతులకు బదులుగా ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచన బాగుందన్నారు. మంగళవారం సచివాలయంలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో రైతు కమిషన్ బృందం సమావేశమైంది. రంగారెడ్డి జిల్లాలో 2005 నుండి హార్డ్ వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ ల కోసం ప్రభుత్వాలు చేపట్టిన భూసేకరణపై చర్చించారు. చిరకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సేకరణ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతుల అభీష్టం మేరకు ఫార్మా సిటీని రద్దు చేయడమే కాకుండా , రైతాంగానికి అన్యాయం జరగకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా భూ నష్టపరిహారంతో పాటు ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో కొందరు రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదని, కొన్ని కేసులు కూడా ఉన్న విషయాలను కూడా ప్రస్తావనకు తెచ్చారు. వారందరికీ కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కమిషన్ కోరింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ అధికారి హరి వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.

Next Story