- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క డ్రైవర్ కూడా ఉద్యోగం నుంచి తొలగించం.. ఆర్టీసీ కార్మీకులకు సీఎం రేవంత్ హామీ
ఆర్టీసీ మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీనంపై అన్ని సంఘాల నాయకులు సమావేశమై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. పీఆర్సీ అంశాన్ని తాము పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులతో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీనంపై ఏవిధంగా ముందుకు పోవాలనే దానిపై సంఘాల నాయకులు సమావేశమై ప్రభుత్వం ఎదుట ఆప్షన్లు ఉంచాలని సూచించారు. ఒకవేళ యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఏ యూనియన్‌కు ఆ యూనియన్ తమ ఆప్షన్లు ఇస్తే కామన్‌గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి.. భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చర్చిద్దామని సీఎం అన్నారు.
బకాయిలన్నీ వారివే..
ఆర్టీసీ బకాయిలు తమ హయాంలోని కావని.. కానీ వాటిని చెల్లించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల నిధులను వాడుకుందని సీఎం గుర్తు చేశారు. ఆర్టీసీ సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నామన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి అంతా కలిసిరావాలని, భావోద్వేగాలు, రాజకీయాల ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం వాటిల్లుతుందని సీఎం అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వం వేర్వేరనే భావన తమకెప్పుడూ లేదన్నారు. 2006లో జడ్పీటీసీ సభ్యునిగా గెలిచిన్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అధ్యక్షునిగా ఉన్న సమయలో ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటాల్లో పాలుపంచకున్నానని సీఎం గుర్తు చేశారు. సింగరేణి, విద్యుత్ కార్మికులతో పాటు ఆర్టీసీ కార్మికులు బలంగా కోరుకున్నందునే తాము అధికారంలోకి వచ్చామని సీఎం తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో నియామకాలు చేపట్టడంతో పాటు బస్సుల సంఖ్యను పెంచామని, కారుణ్య నియామకాలు చేప్టటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. నెలా నెలా చెల్లింపులతో ఆర్టీసీ ఆదాయం పెరిగిందని సీఎం అన్నారు. పని భారం పెరిగినా క్షేత్ర స్థాయి సిబ్బంది సహనంతో పని చేస్తుండడంతో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త బస్ టెర్మినల్స్..
ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బస్ టెర్మినళ్లు నిర్మించడానికి ఆర్టీసీకి గాజులరామారంలో వంద ఎకరాలు కేటాయించామని, బహదూర్‌గూడ (శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో)లో 150 ఎకరాలు కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఆర్టీసీని సమున్నత స్థానంలో నిలపాలనే లక్ష్యంతోనే ఈ టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల నుంచి డిమాండ్ లేకపోయినా తామే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ఆర్టీసీలో డీజిల్‌కు ఏటా రూ.2 వేల కోట్లు వ్యయం చేస్తున్నారని.. ఆ వ్యయం తగ్గింపునకే తాము ఈవీల వైపు మొగ్గుచూపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాలని, దీనికి పక్కా ప్రణాళిక అవసరమని సీఎం అన్నారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రో, ఎంఎంటీఎస్‌తో అనుసంధానం చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీకి కృషి చేస్తామని సీఎం తెలిపారు. అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. సంస్థను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడానికి కార్మికులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్‌ను తొలగించమని ముఖ్యమంత్రి తెలిపారు.
కార్మికులు, యాజమాన్యం మధ్య గ్యాప్ రావద్దు..
ఆర్టీసీ కార్మికులు, మేనేజ్‌మెంట్ మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. డిపో మేనేజర్లు, ఈడీ, ఎండీ స్థాయి అధికారులు తరచూ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకుంటే సగం సమస్యలు పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో మూడు నెలలకోసారి సమావేశం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అనేక ఇబ్బందులున్నా ఉద్యోగులు, కార్మికులు సమస్యల పరిష్కారానికి తాము పెద్దపీట వేస్తున్నామని సీఎం తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల చెల్లింపులను రూ.700 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ సమస్యలను 100 శాతం పరిష్కరిస్తామని.. కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్న చిన్న స్పర్ధలతో సంస్థకు నష్టం వాటిల్లే పనులు చేయకూడదని.. సంస్థ మనుగడ సాగిస్తేనే అందరికీ మేలు జరుగుతుందని సీఎం అన్నారు.
సమ్మె కాలానికి వేతనాలు.. కేసులు లేకుండా..
ఈ సందర్భంగా 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వత్థామ రెడ్డి, శంకర్, వీరాంజనేయులు, వి.ఎస్.రావు, ఎస్.బాబు, పి.కమల్ రెడ్డి, ఎండీ మౌలానా, ఎంకే బోస్, బి.యాదగిరి, జి.అబ్రహం, మొగుళ్ల రాజిరెడ్డి, రాజిరెడ్డి, బి.యాదయ్య, బి.మునిరాములు, కె.యాదయ్య, కె.సత్యనారాయణ, ఎండీ అక్బర్ అలీ, కె.మనోహర్‌రావు, ఈ.స్వామి కుమార్, పున్న హరికిషన్, గోవింద్, డి.వి.కె.రావు, కె.హనుమంతు ముదిరాజ్, దువ్వాసీ యాదయ్య, సుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.






