త్వరలో అసంఘటిత కార్మికులతో సీఎం రేవంత్ సమావేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-16 15:18:31  IST  )

త్వరలో అసంఘటిత కార్మికులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు..

త్వరలో అసంఘటిత కార్మికులతో సీఎం రేవంత్ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే అసంఘటిత కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో అసంఘిటిత కార్మికుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్​లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అఖిల భారత అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గతంలోనే అసంఘటిత కార్మికుల సమస్యలు విన్నామని, కార్మికులందరూ కష్టపడాలని, మిమ్మల్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. మీ శ్రేయస్సు కోసం పార్టీ పరంగా సీఎంతో చర్చిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

దేశంలోని అన్నీ రకాల ప్రజలను , కార్మికులను ఆదుకోవాలని రాహుల్ గాంధీ బలమైన ఆలోచనతో ఆకాంక్షిస్తున్నారన్నారు. అసంఘటిత కార్మికులు అత్యంత శ్రమ పడుతారని, కానీ సరియైన గుర్తింపు ఉండదని, వీరికి శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అణగారిన వెనుకబడిన కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది అసంఘటిత కార్మికులు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేకేసీ నేషనల్ చైర్మన్ ఉదిత్ రాజ్, కాంగ్రెస్​ ముఖ్య నేతలు జెట్టి కుసుమ కుమార్, కేకేసి నేషనల్ వైస్ చైర్మన్ షేక్ ఇబ్రహీం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.

Next Story