గద్దర్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ సక్సెస్.. తెలుగు సినీ ప్రముఖులకు CM రేవంత్ థాంక్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-15 03:34:05  IST  )

ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024’(Telangana Gaddar Film Awards) వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది.

గద్దర్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ సక్సెస్.. తెలుగు సినీ ప్రముఖులకు CM రేవంత్ థాంక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024’(Telangana Gaddar Film Awards) వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు. 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014-24 వరకు పదేళ్ల కాలానికి గానూ సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాళికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy), తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు. ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణకి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును మణిరత్నంకి, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును సుకుమార్‌కి, నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావుకి, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండకు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్‌కి, ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్‌కు, ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్‌కి అందజేశారు. ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు.

ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్(Chandra Bose), ఎంఎం కీరవాణి(MM Keeravani)ని ఈ వేదికగా ముఖ్యమంత్రి సత్కరించారు. గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరపున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్‌కు అందజేశారు. సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story