వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

by Prasad Jukanti |

వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు ఉన్నట్లు సమాచారం అందడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వియాత్నంలో భారతీయులు ఉన్న పడవ మునక ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మరణించారన్న సమాచారంపై ముఖ్యమంత్రి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారతీయ ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ ప్రమాదంలో తెలుగువారు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో పూర్తి సమాచారం తీసుకోవాలని, ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు:

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదానికి గురైన పర్యాటకులలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం అందడంతో.. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మరియు రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబ సభ్యుల సమాచారం కోసం.. తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన (NRI) విభాగం ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ పని చేయనుంది. వియత్నాం ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడానికి, అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వం క్రింది హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

కంట్రోల్ రూమ్ సంప్రదించాల్సిన నెంబర్లు:

9885371189

7997959754

9989654807

7997959779

Next Story