కాళేశ్వరానికి సీఎం రేవంత్ ‘రిపేర్’: వానాకాలంలోపే మేడిగడ్డ పునరుద్ధరణకు డెడ్‌లైన్!

by Kema Shiva Kumar |

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరానికి సీఎం రేవంత్ ‘రిపేర్’: వానాకాలంలోపే మేడిగడ్డ పునరుద్ధరణకు డెడ్‌లైన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మరీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. తద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణానికి సిద్ధం అయితే.. అక్కడ నీటి లభ్యత లేదనే సాకుతో లొకేషన్‌ను కాళేశ్వరానికి మార్చారు. అయితే.. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులోని బ్యారేజీ పిల్లర్లు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగుబాటుకు గురైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ వేసి విచారణ చేయించింది. ఈ క్రమంలో తాజాగా ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యారేజీలకు మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని మరమ్మతులు పూర్తి చేసి, అవసరమైన సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

మరమ్మతులు వేగవంతం..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం తాజాగా సమీక్ష చేయడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనులు వేగవంతంగా కానున్నాయి. ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్షల ఎకరాల సాగు నీరు అందనుంది. అయితే.. ప్రాజెక్టు పడావు పడినప్పటి నుంచి సుమారు 8 లక్షల ఎకరాల వరకు సాగు పరిస్థితి ప్రశ్నార్థకమైంది. తాజాగా.. సీఎం ఆదేశాలతో నీటి సరఫరా పునరుద్ధరించే విషయం రైతాంగానికి కొంత ఊరటనిస్తోంది. అదేస్థాయిలో ఈసారి నిజంగా గడువులో పూర్తవుతాయా? అనే ప్రశ్న రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించిన విధంగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం ప‌ర్యవేక్షణ చేయాల‌ని సూచించారు. సెంట్రల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ ఆధ్యర్యంలో ప‌రీక్షలు, న‌మూనాల సేక‌ర‌ణను వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తిచేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అటు నీటిపారుద‌ల శాఖ, సీడ‌బ్ల్యూపీఆర్ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్‌తో టీమ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

నిర్మాణ సంస్థల ఉద్దేశమేంటి..?..

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణలో నిర్మాణ సంస్థల స్పందన అత్యంత కీలకంగా మారింది. భారీ స్థాయిలో సాంకేతిక మరమ్మతులు, నిర్మాణపరమైన బలపరిచే పనులు అవసరమవుతున్న నేపథ్యంలో చేపట్టేందుకు సంస్థలు ముందుకు వస్తాయా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, ఒత్తిడి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనిశ్చితి కలిసి కాంట్రాక్టర్లలో అభద్రతా భావం నెలకొంది. ముఖ్యంగా మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాల్లో లోపాలు బయటపడిన తర్వాత, మరమ్మతులు సాధారణ పనులు కాకుండా అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్ సవాళ్లుగా మారాయి. అంతేకాకుండా.. వాటిని నిర్మించిన సంస్థలే వాటికి రిపేర్లు చేయాలని మొదటి నుంచీ ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. అయితే.. ఈ ఆదేశాలకు మాత్రం నిర్మాణ సంస్థలు పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మరోసారి వాటి వైఖరి మీదనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాగా నీటి సరఫరా పునరుద్ధరించకపోతే అధిక విస్తీర్ణంలో సాగు వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.

వానాకాలంలోపే సవాల్..

కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణలో సమయమే ప్రస్తుతం అతిపెద్ద నవాల్‌గా మారింది. వరదల సీజన్ వేగంగా దగ్గరపడుతున్న నేపథ్యంలో పరిమిత గడువులోనే విస్తృత స్థాయి మరమ్మతులు పూర్తి చేయాల్సిన పరిస్థితి అధికారుల ముందుంది. ఒకవైపు దెబ్బతిన్న బ్యారేజీలు, పంప్ హౌస్‌లో సాంకేతిక సమస్యలు, మరోవైపు క్లిష్టమైన ఇంజినీరింగ్ పనులు.. ఈ రెండింటినీ సమాంతరంగా పూర్తి చేయడం పెద్ద పరీక్షగా మారింది. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్‌ని అధ్యయ‌నం చేయాల్సి ఉంటుంద‌ని ఇంజినీర్లు చెబుతున్నారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంది. పనుల ప్రణాళిక, టెండర్లు, నిర్మాణ సంస్థల ఎంపిక, యంత్రాంగం సమీకరణ వంటి ప్రతి దశలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉండటంతో గడువు మరింత కఠినంగా మారింది. అయితే.. నిధుల విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎం భరోసా ఇవ్వడంతో పనులు సైతం చకచకా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Next Story