దేశంలో మహిళల శ్రమకు తగిన గుర్తింపు కరువు : సీఎం రేవంత్

by Naga Rani Yarlagadda |

మహిళల ఆర్థిక అభివృద్ధి బాగుంటే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మనదేశంలో మహిళల శ్రమకు తగిన గుర్తింపు లేదన్నారు.

దేశంలో మహిళల శ్రమకు తగిన గుర్తింపు కరువు : సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఏ పదవినైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపునిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రజాభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, మహిళా జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సరైన గుర్తింపునివ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళలు ఎక్కడున్నా రాణిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ కలెక్టర్ గా మహిళ బాధ్యత వహిస్తున్నారని గుర్తుచేశారు. అలాగే ఎస్ఐబీ అధిపతిగా కూడా మహిళనే పెట్టామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1000 బస్సులకు మహిళలే యజమానులుగా ఉన్నారన్నారు. అలాగే 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేవారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామని తెలిపారు. రాష్ట్ర మహిళలు తయారు చేస్తున్న వస్తువుల్ని అమెజాన్ లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినపుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, మన దేశంలో మహిళల శ్రమకు తగిన గుర్తింపు లేదన్నారు.

Next Story