పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ప‌ర్య‌ట‌న - ఉత్త‌మ్

by velandi.Saikiran |

పాలమూరు ప్రాంతంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ప‌ర్య‌ట‌న - ఉత్త‌మ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాలమూరు ప్రాంతంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో చేపట్టనున్న రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటన, పాలమూరు ప్రాంత సాగునీటి భవిష్యత్తును నిర్దేశించే చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుందన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన సన్నాహక సమావేశం జలసౌధలో మంగళవారం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన ద్వారా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గమనాన్ని మార్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని తెలిపారు. పాలమూరు ప్రాంత సాగునీటి సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ప్రాజెక్టుల వారీగా క్షేత్రస్థాయి సమీక్షలు చేపట్టి, ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి, తక్షణమే భారీ నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. 4న సాయంత్రం సోమశిలలో సీనియర్ ఇంజినీర్లతో ప్రత్యేకంగా సీఎం సమావేశమవుతారని వెల్లడించారు. అక్కడ తాజా స్థితిగతులు, సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై సవివరమైన ప్రజెంటేషన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే.. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన కోసం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. వీటి ద్వారా ప్రాజెక్టు సైట్‌లను ఏరియల్ సర్వే చేసి, ప్రాజెక్టుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ, ఇతర సంబంధిత శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Next Story