CM Revanth Reddy: వికసిత్ భారత్ కు అనుగుణంగా 'తెలంగాణ రైజింగ్ 2047' నినాదం: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

CM Revanth Reddy: వికసిత్ భారత్ కు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 నినాదం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశ పురోభివృద్ధి ప్రతి రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. వికసిత్ భారత్ (Vikasit Bharath) కు అనుగుణంగా 'తెలంగాణ రైజింగ్ 2047' (Rising Telangana 2047) అనే నినాదంతో మా రాష్ట్ర కార్యచరణ పథకాన్ని సమర్పిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మా ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్డు మ్యాప్ ప్రతిబింబం అన్నారు. ఇంత సాహ‌సోపేత‌మైన మార్పును సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం, భాగస్వామ్యం అత్యంత అవసరం. ఈ విష‌యంలో సహకార స‌మాఖ్య స్ఫూర్తితో కలిసి పని చేయాలని మేం ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో (NITI Aayog Governing Council meeting) మాట్లాడిన సీఎం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆయా ప్రాంతాలకు మద్దతుగా నిలవడంతో పాటు ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యవసరం అన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించాలని జాతీయ వృద్ధిలో సమతుల్యత చాలా కీలకం అన్నారు. ఈ రోజు మనం చేసే చర్చలు దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని చెప్పారు.

పదేళ్లలోనే మా లక్ష్యం చేరుకోవాలనే సంకల్పం..

ట్రిలియన్ డాలర్ల డీఎస్ డీపీ సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. జాతీయ స్థాయి అంచనాల ప్రకారం ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని భావిస్తున్నాం. కానీ ఈ వచ్చే పదేళ్లలోనే ఈ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో తెలంగాణ ఉందన్నారు. ఇది కేవలం కోరిక మాత్రమే కాదని వ్యూహాత్మక ప్రణాళిక, స్పష్టమైన దిశతో ముందుకు సాగుతున్న లక్ష్యం అన్నారు. ప్రతి ఆరేళ్లకు ఒక సారి మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని మేం స్థిరంగా కొనసాగించామని ఇదే ఊపుతో ప్రస్తుత దశాబ్దంలోనే మా జీఎస్ డీపీని ఐదు రెట్లు విస్తరించడంపై దృష్టి సారించామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లో మహిళా సాధికారత కీలకం అని అందుకే మా ప్రభుత్వం మహిళా స్వావలంబన, పెట్టుబడులు, చలనశీలత, ఆర్థికాభివృద్ధిని దన్నుగా నిలిచే పథకాలను రూపొందించామన్నారు.

ఆ రెండు బిల్లులు రాష్ట్రపది ఆమోదానికి పంపించాం..

యువత సాధికారతపైనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని వారికి నైపుణ్యాలు కల్పించడమే మన ముందున్న అసలైన సవాల్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని కీలక పరిశ్రమల్లో మరో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించబడ్డాయన్నారు. రైతు సంక్షేమం, ఉత్పాదకత మెరుగుపర్చడం, నమ్మకమైన స్థిర ఆదాయాలను కల్పించేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. కులగణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలనే నిర్ణయానికి మా అసెంబ్లీ తీర్మానం ప్రేరణ నివ్వడం మాకు గర్వకారణం అన్నారు. పహెల్గాం ఉగ్రదాడిని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో మన దేశ సాయుధ దళాలు చేపట్టిన ప్రతి చర్యకు మేం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ లోపాల్గొన్న సైనికులకు తెంలగాణ పూర్తి మద్దతు ప్రకటించిందని సైన్యం ధైర్యానికి త్యాగాలకు తెలగాణ సెక్యూట్ చేస్తోందన్నారు.

Next Story