వేడిక్కిన జూబ్లీహిల్స్‌ ప్రచారం.. కేటీఆర్‌పై రెచ్చిపోయిన CM రేవంత్

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.

వేడిక్కిన జూబ్లీహిల్స్‌ ప్రచారం.. కేటీఆర్‌పై రెచ్చిపోయిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో సీఎం రేవంత్‌ రెడ్డి కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు కారును షెడ్డుకి పంపించారని విమర్శించారు. బిల్లారంగాలు(కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి) జూబ్లీహిల్స్‌లో ఆటోల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేదోళ్ల దైవం పీజేఆర్‌ మృతిచెందినప్పుడు.. ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పీజేఆర్‌ కుటుంబానికి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఆనాడు టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ కేసీఆర్‌ ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు. ఒక దుష్ట సంప్రదాయానికి కేసీఆర్ ఆనాడు తెరలేపారని సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

‘ఆస్తిలో వాటా అడుగుతుందని సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి పార్టీ నుంచి తరిమివేసినోడు కేటీఆర్.. అలాంటోడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను గెలిపించాలని తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే.. కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట’ అనే సామేత గుర్తొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయడానికి ముందు.. కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను అడ్డం పెట్టుకొని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు అక్రమంగా సంపాదించుకున్నారని కవిత ఆరోపణలు చేస్తున్నది. దమ్ముంటే ముందు ఆ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story