డీలిమిటేషన్‌పై CM రేవంత్ యుద్ధం.. కేంద్రానికి సంచలన హెచ్చరిక

by Gantepaka Srikanth |

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

డీలిమిటేషన్‌పై CM రేవంత్ యుద్ధం.. కేంద్రానికి సంచలన హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ అనేది కేవలం రాజకీయ పార్టీల సమస్య కాదని, ఇది ప్రాంతాల అస్తిత్వానికి సంబంధించిన సమస్య అని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కేంద్రం ఆడుతున్న రాజకీయ డ్రామా అని సీఎం విమర్శించారు. "మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునర్విభజన అవసరమే లేదు. కానీ, దీని సాకుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యతను తగ్గించాలని కేంద్రం కుట్ర చేస్తోంది. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల ఎంపీ సీట్లు 600 దాటితే, దక్షిణాది సీట్లు కేవలం 195 దగ్గరే ఆగిపోతాయి. అప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సౌత్ ఇండియా అవసరమే ఉండదు. ఇదే కేంద్రం అసలు ప్లాన్" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దక్షిణాదిపై వివక్ష.. తిరుగుబాటు తప్పదు!

దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే పన్నుల వాటాలో, నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. "సౌత్ ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉంటే, నార్త్ ఇండియా పొలిటికల్ క్యాపిటల్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్‌గా చూస్తున్నారు. ఇప్పటికే గాయపడి ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ఇంకా అన్యాయం చేస్తామంటే ప్రజలు తిరగబడటం ఖాయం. ఇది చివరకు పెద్ద ప్రజా ఉద్యమానికి దారితీస్తుంది" అని హెచ్చరించారు. ముందుగా దేశవ్యాప్తంగా జనగణన, కులగణన పూర్తి చేయాలి. 2027 మార్చి నాటికి ఈ ప్రక్రియ ముగిశాకే డీలిమిటేషన్‌పై ఆలోచించాలి. కేవలం జనాభానే కాకుండా ఆర్థికాభివృద్ధి, జీడీపీ (GDP), కుటుంబ నియంత్రణ పాటిస్తున్న తీరును బట్టి ఎంపీ సీట్ల పెంపు ఉండాలి. ఈ వివక్షపై 'ఇండియా' కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఉమ్మడి పోరాటం చేస్తాం.

బీజేపీకి హెచ్చరిక..

గతంలో రైతుల చట్టాల విషయంలో ఎలాగైతే వెనక్కి తగ్గారో, మొండిగా వెళ్తే డీలిమిటేషన్ విషయంలోనూ బీజేపీకి అదే గతి పడుతుంది. తెలంగాణలో ఐదు నెలల్లోనే జనగణన, కులగణన పూర్తి చేసి తాము చిత్తశుద్ధిని చాటుకున్నామని, కేంద్రం కూడా అదే బాటలో నడవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story